ఎల్లో మీడియాకు వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు భారీ విందు ఇవ్వనున్నారు. అదీ ఒక పూటో, ఒక రోజో కాదు. కొన్ని రోజుల పాటు మూడు పూటలా పసందైన విందు ఇవ్వనున్నారు. ఇందులో వెజ్, నాన్‌వెజ్, చైనా , అమెరికా, జపాన్ వంటకాలు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ బిర్యానీ స్ఫెషల్ కంటే కూడా ఎవరూ ఊహించని వంటకాలు తయారు చేస్తున్నట్టు సమాచారం. అవును మీరు చదువుతున్నది, వింటున్నది నిజమే. ఎల్లో మీడియాకు వారిష్టమైన వంటకాలకు సరిపడే రాజకీయ సరంజామాను రఘురామకృష్ణమరాజు అందజేయనున్నారు.
ఇటీవల కాలంలో నర్సాపురం ఎంపీ వార్తల్లో వ్యక్తి అయ్యారు. పార్లమెంట్లో తెలుగు భాషను కాపాడాలని కోరినప్పటి నుంచి ఆయన మీడియాకు , అందులోనూ ఎల్లో మీడియాకు ఎంతో ప్రీతిపాత్రమైన నేత అయ్యాడు. ఆయన మాట్లాడినా వార్తే, ఏం మాట్లాడకపోయినా వార్తే. వార్తలను సృష్టించడంలో ఆయనకు ఆయనే సాటిగా మారారు. ప్రధాని మోడీతో రాజుగారు అని ఆప్యాయంగా పిలిపించుకోవడం, బీజేపీ పార్లమెంటరీ కార్యాలయంలోకి దర్జాగా వెళ్లడం…ఇలా ఆయన ప్రతి కదిలికా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుదుపు తెస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ నెల 11న ఆయన ఢిల్లీలో ఎంపీలందరికీ విందు ఇవ్వనున్నారనే వార్త మరో సంచలనానికి దారి తీస్తోంది. పార్లమెంట్లో జగన్ సర్కార్ నిర్ణయానికి విరుద్ధంగా ఆయన మాట్లాడడం, ప్రధాని, హోంమంత్రిలతో తరచూ భేటీ కావడం…వైసీపీ అధిష్టానానికి మింగుడుపడడం లేదు. ఇలాంటి రాజకీయ వాతావరణ పరిస్థితుల్లో మరీ ముఖ్యంగా తన వియ్యంకుడైన కేవీపీ ఇంట్లో రఘురామకృష్ణంరాజు విందు ఇస్తుండడం ప్రాధాన్యం సంతరించుకొంది.
ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాతో పాటు అన్ని పార్టీల ఎంపీలకు విందు ఇవ్వనుండడం వైసీపీకి తలనొప్పిగా మారింది. అసలు వేళకాని వేళ, ఏ సందర్భం లేకుండా…అదీ తన వియ్యంకుడి ఇంట్లో రఘురామకృష్ణంరాజు విందు ఎందుకు ఇస్తున్నారనే విషయమై వైసీపీ పెద్దలు ఆరా తీస్తున్నారని సమాచారం. తనకు అధికారిక నివాసం లేకపోవడం వల్లే వియ్యంకుడి ఇంట్లో విందు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు రఘురామకృష్ణంరాజు చెబుతున్నప్పటికీ….మరే ఇతర కారణాలైనా ఉన్నాయా అనే కోణంలో వైసీపీ పెద్దలు సీరియస్‌గా దృష్టి సారించారని సమాచారం.
రఘురామకృష్ణంరాజు విందు రాజకీయం మరీ ముఖ్యంగా ఎల్లో మీడియాకు ఓ పదిరోజులకు సరిపడేలా మసాలా వార్తల వంటకానికి ఇబ్బంది లేకుండా చేస్తోందనే వాదన వినిపిస్తోంది. లోక్‌సభ సమావేశంలో రఘురామకృష్ణంరాజు తెలుగు భాషపై మాట్లాడిన తీరుపై సీఎం జగన్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సీఎంను ఎంపీ కలిసిన తర్వాత వాతావరణం చల్లబడింది. మొత్తానికి ఆ సమస్య సర్దుమణిగిందనే లోపే మరో సంచలనానికి రఘురామకృష్ణంరాజు అడుగులు వేస్తున్నారని చెప్పక తప్పదు.
మొత్తానికి ఎంపీలకు ఆయన ఏం వడ్డిస్తారో తెలియదు కానీ, ఎల్లో మీడియాకు మాత్రం రకరకాల ఊహాగానాలతో వార్తలను వండి వార్చేందుకు అవకాశం కల్పిస్తున్నారనేది పచ్చి నిజం.