
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అయోమయంలో ఉన్నారు. ముఖ్యంగా బీజేపీతో పొత్తు విషయంలో ముందుకా? వెనక్కా? అనేది తేల్చుకోలేక సతమతం అవుతున్నారు.
మరోవైపు మోదీ సర్కార్ ఏపీకి అన్యాయం చేసిందనే ఆగ్రహం ఆ రాష్ట్ర ప్రజానీకంలో వుందని, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నష్టపోవడం ఖాయమని, చేజేతులా జగన్ చేతిలో అధికారం పెట్టినట్టు అవుతుందని చంద్రబాబును ఎల్లో మీడియాధిపతులు హెచ్చరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
2019 ఎన్నికల సందర్భంలో కూడా చంద్రబాబును ఇదే రీతిలో భయపెట్టి బీజేపీకి ఓ ఎల్లో మీడియాధిపతి దూరం చేశారని అప్పట్లో టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇప్పుడు మరోసారి గతాన్ని పునరావృతం చేస్తూ బీజేపీతో అంటకాగడంపై వద్దే వద్దని చంద్రబాబును ఆయన అనుకూల మీడియాధిపతులు హెచ్చరిస్తున్నారని సమాచారం. దీంతో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
ఒకవైపు జగన్ సర్కార్‌కు కేంద్రంలోని మోదీ సర్కార్ భారీ మొత్తంలో ఆర్థిక సాయం అందజేస్తూ, అండగా నిలుస్తోందని, అలాంటి పార్టీ టీడీపీకి మంచి చేస్తుందని ఎలా నమ్మాలని చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
తాజాగా దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, మోదీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతోందని చంద్రబాబుకు ఎల్లో మీడియాధిపతులు నూరిపోస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీతో దూరంగా వుండడమే మంచిదని చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. దీంతో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేక అయోమయంలో పడ్డారు.
ఒకవేళ బీజేపీతో దూరంగా ఉంటే, కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఇతరత్రా వ్యవస్థలు సీఎం జగన్‌కు అనుకూలంగా తమను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉత్పన్నమవుతుందా? అనే కోణంలో చంద్రబాబు ఆలోచిస్తున్నారని తెలిసింది. మొత్తానికి అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు భేటీ అయినప్పటికీ, ఆ తర్వాత బీజేపీతో పొత్తు తీవ్ర నష్టం వస్తుందని ఆయన్ను కొందరు భయపెడుతున్నారు. మరి రానున్న రోజుల్లో బాబు నిర్ణయం ఎలా వుంటుందో చూడాలి.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా