మద్యం దుకాణాల్లో పనిచేసేందుకు కుర్రాళ్లు కావలెను! ఇందులో మహిళా రిజర్వేషన్ వర్తించే అవకాశం లేదు! రాష్ట్రంలో సుమారు నాలుగువేల దాకా ఖాళీలు ప్రస్తుతానికి రానున్నాయి. ముందుముందు ఈ ఖాళీలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే.. ఈ ఉద్యోగాలు కేవలం ఏడాది కాలానికి మాత్రమే ఉండే కాంట్రాక్టు ఉద్యోగాలు. అయినా సరే.. వీటికోసం నిరుద్యోగ యువకులు విపరీతంగా ఎగబడే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ కనీస విద్యార్హత కాగా.. బీటెక్లూ ఇంకా ఘనంగానూ చదివిన వాళ్లు కూడా ఎగబడే అవకాశం కనిపిస్తోంది.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. మద్యం సిండికేట్ల తోక కత్తిరించేలా.. కొన్ని మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దుకాణాల్లో పనిచేసేందుకు ప్రభుత్వం టెంపరరీ నియామకాలు చేపట్టనుంది. కావాల్సిన అర్హతలు సామాన్యమైనవే. జీతాలు మరీ తక్కువేం కాదు. షాపుకొకడుండే సూపర్ వైజరుకు 17.5వేలు, సేల్స్ మెన్ కు 15వేలు ఇస్తారు. డిగ్రీ, ఇంటర్ పాసయి ఉంటే చాలు. ఆ మండలాలకు లోకల్ అయి ఉండాలి.
అయితే ఈ ఉద్యోగాలు ఇప్పుడు హాట్ కేకుల్లా కనిపిస్తున్నాయి. యువతరం వీటికోసం ఎగబడుతున్నట్లుగా తెలుస్తోంది.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. బెల్టుషాపులను కట్టడి చేయడంలో చాలా దృఢంగా వ్యవహరించడంతో చాలా మంది మద్యం విక్రేతలు వెనక్కి వెళ్లారు. జూన్ నుంచి సర్కారు లైసెన్సులు పొడిగించుకోడానికి, మూడు నెలల గడువు ఇచ్చినప్పటికీ 777 దుకాణాల్ని రెన్యువల్ చేసుకోలేదు. వాటిని ప్రభుత్వం తరఫున నిర్వహించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
గ్రామ వలంటీర్లకంటె ఎక్కువ వేతనాలు ఉండడం, ‘అవినీతి కిందకు రాని’ పై ఆదాయం పుష్కలంగా ఉండడంతో ఈ పోస్టులకోసం ఎగబడేవారు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి సుమారు నాలుగు వేల పోస్టులు లెక్కతేలవచ్పు. ముందుముందు ప్రభుత్వ పరంగా నిర్వహించే షాపుల సంఖ్య పెరిగితే పోస్టులు కూడా పెరుగుతాయి. కాకపోతే జగన్ సర్కారు ఎంత త్వరగా పూర్తి నిషేధం అమల్లోకి తెస్తుందనేదాన్ని బట్టి వీరి ఉద్యోగాల ఆయుష్షు ఆధారపడి ఉంటుంది.