బిగ్ బాస్ రియాలిటీ షోపై మరోసారి రియాక్ట్ అయ్యాడు నాగ్. షో ప్రారంభమైన తర్వాత ఓసారి తన అనుభవాల్ని షేర్ చేసుకున్న నాగార్జున, ఈరోజు మరోసారి తన అనుభవాల్ని పంచుకున్నాడు. బిగ్ బాస్ హౌజ్ లో ఉండడం తన వల్ల కాదంటున్నాడు. తన బెడ్ రూమ్, బాత్ రూమ్ ను మరొకరు వాడితే తట్టుకోలేనంటున్నాడు నాగ్.
“అసలు వాళ్లంతా హౌజ్ లో ఎలా ఉంటున్నారో నాకైతే అర్థంకావట్లేదు. వాళ్ల సంగతి పక్కనపెడితే నేను మాత్రం అలా ఉండలేను. నా వల్ల కాదు. నా భార్య అమల కాకుండా మరో వ్యక్తి నా బెడ్, బాత్ రూమ్ షేర్ చేసుకోవడం నాకు నచ్చదు. బిగ్ బాస్ షోకు పాపులారిటీ పెరుగుతోంది. మంచి రేటింగ్స్ వచ్చాయి. సో.. ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చేశారని అనుకుంటున్నాను. నేను మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాను. కంటెస్టెంట్లతో జోక్స్ వేస్తున్నాను. నా నేచర్ కు అది సరిపోయింది.”
గతంలో తను చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి, ఇప్పుడు చేస్తున్న బిగ్ బాస్ సీజన్-3కు చాలా తేడా ఉందంటున్నాడు కింగ్. మరీ ముఖ్యంగా కంటెస్టెంట్లను జడ్జ్ చేయడం తనకు చాలా కష్టంగా ఉందని, ఏ వారం ఎవరు, ఎలా మారిపోతున్నారో చెప్పడం చాలా కష్టంగా ఉందంటున్నాడు.
“మీలో ఎవరు కోటీశ్వరుడులో ఎక్కువగా మాట్లాడ్డం ఉండేది. లైఫ్ స్టోరీస్ కు సంబంధించిన విశేషాలు వచ్చేవి. కానీ బిగ్ బాస్ అలా లేదు. ప్రతివారం టాపిక్స్ మారిపోతున్నాయి. అంతేకాదు, మనుషులు కూడా మారిపోతున్నారు. ఒకరి గురించి ఒకవారం ఏదో అనుకుంటాను, వచ్చే వారం వాళ్లు అలా ఉండడం లేదు. ఒకే వ్యక్తి ఒక్కోసారి ఒక్కో విధంగా కనిపిస్తున్నారు. ఈ ఎక్స్ పీరియన్స్ చాలా బాగుంది.”
మన్మథుడు-2 ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన నాగ్.. తమిళ్ లో ధనుష్ తో చేయాల్సిన సినిమా ఆగిపోయినట్టు ప్రకటించాడు. ఏకంగా 35 రోజుల పాటు షూటింగ్ చేసి మరీ ఆ సినిమా ఆపేశారని, కారణాలు తనకు తెలియవని తెలిపాడు.