ఒకవైపు మోడీ కథ అయిపోయిందన్నట్టుగా, ఎన్డీయేకు మళ్లీ అధికారమే ఛాన్స్ లేదన్నట్టుగా కొన్ని విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. కేసీఆర్ కూడా కాంగ్రెస్ వైపు చేరిపోతాడని, జగన్ కూడా కాంగ్రెస్ కూటమికే మద్దతు పలికే అవకాశం ఉందని రూమర్లు మొదలయ్యాయి. ఒక జాతీయ పత్రిక ఇందుకు సంబంధించి కథనాన్ని ఇచ్చింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు మాత్రం ఈ విషయంలో బయటపడటం లేదు.
కానీ ఈరోజు జగన్ సొంతపత్రిక 'సాక్షి'లో వచ్చిన ఒక కథనాన్ని గమనిస్తే, వైఎస్సార్సీపీ అజెండా ఏమిటో అర్థం చేసుకోవడం పెద్ద కష్టంఏమీ కాదు. 'ఎన్డీయే 240 రన్ ఔట్' అంటూ ఆ కథనంలో విశ్లేషించారు. ఈ దశలో ప్రత్యేకంగా సర్వేలు, అంచనాలు, విశ్లేషణలు వినిపించాల్సిన అవసరం లేదు. ఒకవైపు పోలింగ్ ప్రక్రియ సాగుతూ ఉన్న నేపథ్యంలో ఈ కథనం అసలు ఉద్దేశం వేరేనేమో అనే అభిప్రాయాలకు అవకాశం ఏర్పడుతూ ఉంది.
ఎన్డీయే రెండు వందల నలభై స్థాయికి వచ్చి ఆగిపోతుందని, కూటమికి మెజారిటీకి మరో నలభై వరకూ ఎంపీ సీట్లుఅవసరం కావొచ్చు అన్నట్టుగా ఆ కథనంలో విశ్లేషించారు. రనౌట్ అని వ్యాఖ్యానించినప్పటికీ, కథనంలో కాంగ్రెస్ కోలుకోలేదు అనే ఎక్కువ విశ్లేషణ సాగింది. ఆ పరిణామాల్లో ఎన్డీయేతర, యూపీయేతర పార్టీలు కీలక భూమిక పోషించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని వివరించారు. కేంద్రంలో మద్దతు విషయంలో జగన్ అజెండా ఒకటే అని, అది ఏపీకి ప్రత్యేకహోదా అంశం మాత్రమే అని స్పష్టంగా పేర్కొన్నారు.
'కాంగ్రెస్ పుంజుకోలేదు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ బలపడలేదు. రాహుల్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి ప్రాంతీయ పార్టీలు ఒప్పుకునేలా లేవు. మమత, మాయ, ములాయంలు కూడా రాహుల్ ను పీఎంగా ఒప్పుకోరు..' అంటూ సూటిగా సుత్తిలేకుండా రాహుల్ పై వ్యతిరేకతను జగన్ పత్రిక వ్యక్తంచేసింది. ఈ కథనాన్ని బట్టిచూస్తే.. జగన్ ఎంపిక ఎన్డీయే వైపే ఉందని స్పష్టం అవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.