వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి తన కోర్కెల చిట్టాను కేంద్రం వద్ద పెట్టిన సంగతి తెలిసిందే. పలు అంశాలను ప్రస్తావిస్తూ.. రాష్ట్ర సంబంధం వ్యవహారాలను, తన రాజకీయ సంబంధ వ్యవహారాలను జగన్ ఢిల్లీలో మోడీ, అమిత్ షాల దగ్గర పెట్టారు. వాటిలో కొన్నింటికి వారు సూఛాయగా ఓకే చెప్పినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవైపు జగన్ ప్రతిష్టకు సంబంధించిన కొన్ని అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మోడీ, షాలు తమవి కూడా ఒకటీ రెండు కోరికలు జగన్ వద్ద పెట్టారట! అందులో ఒకటి.. రాజ్యసభ సీటు!
భారతీయ జనతా పార్టీ ఆకలి ఇంకా తీరలేదు. లోక్ సభలో తిరుగులేని మెజారిటీని కలిగి ఉన్న భారతీయ జనతా పార్టీ… రాజ్యసభలో మాత్రం ఇంకా ఆకలి తీరనట్టుగా ఉంది. ఆ ఆకలిని తీర్చుకోవడానికి జగన్ నుంచి కూడా కొంత సహాకారాన్ని ఆశిస్తోందనే ప్రచారం జరుగుతూ ఉంది. తమ కోటాలో దక్కే నాలుగు రాజ్యసభ సీట్లలో ఒకటి బీజేపీకి త్యాగం చేయాలని జగన్ ను కోరారట మోడీ, షాలు.
రాజ్యసభలో వీలైనంతగా బలాన్ని పెంచుకోవాలని బీజేపీ భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కలిసి వచ్చే అవకాశం ఉన్న చోట కోరి సీట్లను పెంచుకోవాలని భావిస్తూ ఉంది. ఇలా ఒక రాజ్యసభ సీటు విషయంలో మోడీ, షాలు కోరితే జగన్ కూడా కాదనే పరిస్థితి లేకపోవచ్చు. తనకు వారి సహకారం అవసరం కాబట్టి ఈ మాత్రం సహకారాన్ని జగన్ అందించడం కూడా పెద్ద విచిత్రం ఏమీ కాదు. వైసీపీలో నేతలంతా దాదాపు గా ఎమ్మెల్యే హోదాల్లో ఉన్నారు.
ఇక ఆశావహులు ఎప్పుడూ ఉండనే ఉంటారు. ఆశ అనేది తీరనిది రాజకీయంలో. కాబట్టి ఈ సంగతులు ఎలా ఉన్నా.. కేంద్ర సహకారం కోసం బీజేపీకి ఒక రాజ్యసభ సీటును త్యాగం చేయడానికి జగన్ పెద్దగా వెనుకాడకపోవచ్చనే అభిప్రాయాలకే ఆస్కారం ఉంది. ఇంతకీ బీజేపీ ఆ ఒక్క సీట్లో ఎవరిని రాజ్యసభకు తీసుకెళ్తుంది.. ఎవరైనా తెలుగు వ్యక్తినా? లేక మరెవరినైనా అనేది కూడా ఆసక్తిదాయకమైన అంశమే. ఆ విషయంలో చిరంజీవి పేరు రావడం మాత్రం పూర్తిగా బేస్ లెస్ ఊహాగానమే అని మాత్రం తెలుస్తోంది.