అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడుతున్నాడనే వార్తలు ఆసక్తిదాయకంగా మారాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనుకున్న జిల్లాలో ఆ పార్టీ తరఫున నెగ్గిన ఇద్దరే ఎమ్మెల్యేల్లో కేశవ్ ఒకరు. ఉరవకొండ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆయన నెగ్గారు.
ఉరవకొండ నుంచి పయ్యావుల ఎప్పుడు నెగ్గివచ్చినా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అందుకోలేకపోతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఈసారి కూడా అదే సెంటిమెంటే రిపీట్ అయ్యింది. ఆ సంగతలా ఉంటే.. తను గెలిస్తే తన పార్టీ అధికారంలోకి రాదు, తన పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తను నెగ్గడం ఉండదన్నట్టుగా ఉన్న పయ్యావుల కేశవ్ ఈ సారైనా అధికార పార్టీ ఎమ్మెల్యే అనిపించుకోవాలని అనుకుంటున్నారట.
అందుకే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడుతూ ఉన్నారని సమాచారం. ఒకవేళ జగన్ మోహన్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి ఉంటే ఈ పాటికే పయ్యావుల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ జరిగిపోయేదని పరిశీలకులు అంటున్నారు. అయితే ఎమ్మెల్యేల ఫిరాయింపులకు జగన్ ఆసక్తి చూపడంలేదు. అసలు వారి అవసరం జగన్‌కు లేనేలేదు.
అయినప్పటికీ ఇప్పుడు ఎమ్మెల్యేలే ఒత్తిడి తెచ్చి తాము చేరతామంటూ జగన్ దగ్గకు వర్తమానాలు పంపుతున్నారు. అలాంటి వారిలో పయ్యావుల కూడా ఒకరని తెలుస్తోంది. విశేషం ఏమిటంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడమేకాదు, జగన్ పెట్టిన షరతులకు అనుగుణంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా పయ్యావుల సై అంటున్నారట!
తనను చేర్చుకోవాలని, తను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ఆయన వర్తమానం పంపిస్తున్నారని టాక్. అలా ఉరవకొండలో పయ్యావుల కేశవ్ రాజీనామా చేస్తే తెలుగుదేశం పార్టీకి ఎలాగూ దిక్కూదివాణం ఉండదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీచేస్తే గెలుపుకు భరోసా ఉండనే ఉంది. ఆ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన క్యాడర్ ఉంది. ప్రస్తుత ఊపులో పయ్యావుల వైఎస్సార్సీపీ తరఫున గెలవడం పెద్ద కథ ఏమీకాదు.
అందులోనూ పయ్యావుల గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఏమీ మంత్రి కాదు. భారీ అవినీతి ఆరోపణలూ లేవు. ఇలాంటి క్రమంలో జగన్ ఓకే చెప్పడానికి అవకాశాలున్నాయి.అయినా ఈ వ్యవహారం అంత వేగిరంగా అయితే సాగడంలేదు. నియోజకవర్గంలో పార్టీని నమ్ముకున్న విశ్వేశ్వరరెడ్డి ఉండనే ఉన్నారు. గత పర్యాయంలో తెలుగుదేశం పార్టీ ఆఫర్లు ఇచ్చినా ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడలేదు. కాబట్టి ఆయన విషయంలో జగన్ ఆలోచిస్తున్నారట.
ఎలాగూ విశ్వేశ్వరరెడ్డికి ఏ ఎమ్మెల్సీ పదవో దక్కే అవకాశాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పయ్యావుల వ్యవహారం గురించి జగన్ ముందు ముందున తేల్చే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. రాయలసీమ మొత్తానికీ తెలుగుదేశం తరఫున గెలిచింది ముగ్గురు ఎమ్మెల్యేలే. వారిలో ఒకరైన పయ్యావుల గనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతే టీడీపీకి సీమ మొత్తం మీద మిగిలేది ఇద్దరే. వారే బావాబామ్మర్దులు కమ్ వియ్యంకులు చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ!
సమ్మర్‌కి బంపర్ బిగినింగ్! హడలెత్తించిన మార్చి! ఆల్‌టైమ్ డిజాస్టర్!