నగరీకరణ ఆందోళనకర స్థాయికి పెరిగిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. అందుకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వార్తల్లో ఆసక్తిని రేపుతూ ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో అపార్టుమెంట్ల నిర్మాణాలపై ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీచేశారు!
బెంగళూరు నగరంలో తాగునీటి కొరత తీవ్రంగా వేధిస్తోందని, ఫలితంగా అపార్టుమెంట్ల కట్టడాలు కొన్నేళ్లు ఆపేస్తేనే మంచిదని అధికారులు, పాలకులు తీర్మానించారు. బెంగళూరుకు ప్రధానంగా కావేరీ నీరు సరఫరా ఉంది. అయితే అనుకున్నంత స్థాయి నీటి లభ్యతలేదు అక్కడి నుంచి. ఇక గ్రౌండ్‌వాటర్ లభ్యత కొంతవరకూ ఉన్నా.. అపార్ట్‌మెంట్‌లు కుప్పలు తెప్పలుగా వెలస్తూ ఉన్నాయి. దీంతో భూగర్భం నుంచి నీటిని తోడేస్తూ ఉన్నారు. దీంతో చాలా చోట్ల గ్రౌండ్ వాటర్ లభ్యత శూన్య స్థాయికి వెళ్లిపోయింది. దీంతో ప్రస్తుతానికి అపార్ట్‌మెంట్ నిర్మాణాలనే ఆపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఈ సమస్య బెంగళూరుకు మాత్రమే సంబంధించినది కాదు. విపరీత స్థాయిలో సాగుతున్న నగరీకరణ ఎలాంటి ఫలితాలకు కారణం అవుతోందో పరిశీలించడానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణ. బెంగళూరు నగరానికి ఐదేళ్లలో మంచినీటి సరఫరాకు మరిన్ని ఏర్పాట్లు చేయనున్నట్టుగా.. అప్పుడు కావాలంటే కొత్తగా అపార్ట్‌మెంట్‌ల నిర్మాణాలకు అనుమతులు జారీ చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. చూడటానికి ఇది కఠినమైన నిర్ణయమే. అయితే తప్పదు. నియంత్రణ అవసరం. నగరీకరణకు ఎక్కడో ఒకచోట బ్రేకులు పడాల్సిందే.
ఇక ఇదే సమయంలో ఇతర పాలకులు కూడా ఈ పరిణామం నుంచి చాలా నీతి గ్రహించవచ్చు. అభివద్ధి అనేది వికేంద్రీకరణ రూపంలోనే ఉండాలి, అది ఒక ప్రాంతానికి, నగరానికి పరిమితం అయితే.. ఇలాంటి పరిణామాలు తప్పవనే సందేశం కూడా ఇస్తోంది ఈ ఉందంతం.
-ఎల్.విజయలక్ష్మి
సమ్మర్‌కి బంపర్ బిగినింగ్! హడలెత్తించిన మార్చి! ఆల్‌టైమ్ డిజాస్టర్!