కేసీఆర్ సంస్కారానికి గ‌వ‌ర్న‌ర్ ప‌రీక్ష‌

తెలంగాణ సీఎం కేసీఆర్ సంస్కారానికి గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌రరాజ‌న్ ప‌రీక్ష పెడుతున్నారు. ఇందుకు ఉగాది ప‌ర్వ‌దినాన్ని ఎంచుకున్నారు. గ‌త కొంత కాలంగా తెలంగాణ సీఎం, గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య విభేదాలు చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే.…

తెలంగాణ సీఎం కేసీఆర్ సంస్కారానికి గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌రరాజ‌న్ ప‌రీక్ష పెడుతున్నారు. ఇందుకు ఉగాది ప‌ర్వ‌దినాన్ని ఎంచుకున్నారు. గ‌త కొంత కాలంగా తెలంగాణ సీఎం, గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య విభేదాలు చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కొంత కాలంగా గ‌వ‌ర్న‌ర్ నివాసం ఉంటున్న రాజ్‌భ‌వ‌న్‌కు సీఎం కేసీఆర్ స‌హా మంత్రులు, అధికార పార్టీ నేత‌లెవ‌రూ వెళ్ల‌డం లేదు.

ఇటీవ‌ల బ‌డ్జెట్ స‌మావేశాల‌ను గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి పేరును కేసీఆర్ పంపితే, దాన్ని తిర‌స్క‌రించడం లాంటి చ‌ర్య‌లు విభేదాల‌ను పెంచుతూ వ‌చ్చాయి. కేసీఆర్‌తో త‌న‌కు విభేదాలున్నాయ‌ని ఓ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌క‌టించ‌డం విశేషం.   

ముఖ్యమంత్రి చాలా కాలం నుంచి రాజ్‌భవన్‌కు రావడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. ఈ గ్యాప్‌కి త‌న‌ వైపు నుంచి ఎలాంటి కారణాలు లేవన్నారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని కోరుకుంటున్న‌ట్టు గ‌వ‌ర్న‌ర్ మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టారు.

‘రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నా. సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికార, విపక్ష పార్టీల నేతలు, ఇతర ప్రముఖులను ఆహ్వానిస్తున్నా. ఇది నా మర్యాద. నా ఆహ్వానాన్ని అందరూ స్నేహపూర్వకంగా స్వీకరిస్తారని ఆశిస్తున్నా’ అని  గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ చెప్ప‌డంలో రాజ‌కీయాన్ని గుర్తించొచ్చు. ఉగాది కొత్త సంవత్సరం సందర్భంగా పాత విషయాలను మరిచి కొత్త ఆరంభాన్ని మనమందరం ఆకాంక్షిద్దామంటూ గ‌వ‌ర్న‌ర్ పేర్కొన‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

తెలుగువారి అతి పెద్ద పండుగైన ఉగాదికి ఆడ‌బిడ్డ ఆహ్వానిస్తే వెళ్ల‌కుండా విమ‌ర్శ‌ల పాల‌వుతారా? లేక వెళ్లి శ‌భాష్ అనిపించుకుంటారా? అనేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గ‌వ‌ర్న‌ర్‌తో విభేదాల‌కు స్వ‌స్తి చెప్పేందుకు కేసీఆర్ ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుంటారా? లేక త‌న ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించ‌డానికి మ‌రొక‌సారి దీన్ని వాడుకుంటారా? అనేది తెలియాలంటే ఉగాది వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.