పాఠశాలలు విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అధికార పార్టీ ఎమ్మెల్సీ సైతం కూడా వ్యతిరేకించారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని అధికార పార్టీ ఎమ్మెల్సీ కోరడం విశేషం. 3,4,5 తరగతులను హైస్కూల్లో కలుపుతూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలతో పాటు ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.
పాఠశాలల విలీనం, ఉపాధ్యాయ పోస్టుల రద్దుపై చివరి రోజు శాసన మండలిలో చర్చ జరిగింది. పీడీఎఫ్, బీజేపీ ఎమ్మెల్సీలతో పాటు వైసీపీ ఎమ్మెల్సీ కూడా వ్యతిరేకించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్ర సాద్ ప్రతిపక్ష ఎమ్మెల్సీతో గొంతు కలపడం చర్చనీయాంశమైంది. పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ… ‘పాఠశాలల విలీనంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఏకపక్షంగా విలీనం చేయడం తగదు. విలీనం ప్రక్రియ వల్ల పిల్లలకు మేలు జరిగితే మేం చేతులెత్తి దండం పెడతాం. లేకపోతే పిడికిలి బిగించి పోరాటం చేస్తాం’ అని హెచ్చరించారు.
వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ మూడో తరగతి పిల్లలు హైస్కూల్ కి వెళితే మిస్‌మ్యాచ్ అవుతుందేమో అని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించాలని ఆయన సూచించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి వైసీపీలో డొక్కా చేరుతారనే ప్రచారం జరిగింది. నేడో, రేపో వైసీపీలో జాయిన్ కావాల్సి ఉండగా, ఆయన రాజకీయ గురువు రాయపాటి సాంబశివరావు సూచనతో టీడీపీలో చేరారు. టీడీపీలో ఎమ్మెల్సీ అయ్యారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ గూటికి చేరారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత డొక్కాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి జగన్ తగిన న్యాయం చేశారు. ఉత్తమ సాహిత్యాభిరుచి కలిగిన డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజకీయాల్లో హుందాగా నడుచుకుంటారనే పేరుంది. 3,4,5 తరగతులను హైస్కూల్లో చేర్చడంపై విద్యా రంగం నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని డొక్కా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి సూచన చేయడం విశేషం.