జ‌గ‌న్ వ్య‌వ‌స్థ సంక్షేమం ఎక్క‌డ‌?

ఎన్ని విమ‌ర్శ‌లొచ్చినా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సంక్షేమ బాట‌పై వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఇదే సంద‌ర్భంలో అభివృద్ధిపై ఆయ‌న ఏ మాత్రం దృష్టి పెట్ట‌లేద‌నేందుకు అసెంబ్లీ వేదిక‌గా ఆయ‌న విడుద‌ల చేసిన సంక్షేమ క్యాలెండ‌రే…

ఎన్ని విమ‌ర్శ‌లొచ్చినా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సంక్షేమ బాట‌పై వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఇదే సంద‌ర్భంలో అభివృద్ధిపై ఆయ‌న ఏ మాత్రం దృష్టి పెట్ట‌లేద‌నేందుకు అసెంబ్లీ వేదిక‌గా ఆయ‌న విడుద‌ల చేసిన సంక్షేమ క్యాలెండ‌రే నిద‌ర్శ‌నం. పేద‌ల‌కు సంక్షేమ ఫ‌లాలు అందించ‌డంపై రాజ‌కీయ విమ‌ర్శ‌లు ప‌క్క‌న పెడితే, గ‌త మూడేళ్ల‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వ అభివృద్ధి మార్క్ ఏదీ అనే ప్ర‌శ్న‌కు జ‌వాబు చెప్పాల్సి వుంది.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలతో కూడిన సంక్షేమ క్యాలెండర్‌ను సీఎం వైఎస్‌ జగన్ శాసనసభలో ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి 2023 మార్చి వరకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల వివరాలను వెల్ల‌డించారు. జూన్‌లో అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాలకు రూ.6,500 కోట్లు, సెప్టెంబర్‌లో వైఎస్సార్‌ చేయూత ద్వారా 25 లక్షల మంది మ‌హిళ‌ల‌కు రూ.4,500 కోట్లు , జనవరిలో వైఎస్సార్‌ ఆసరాతో దాదాపు 79 లక్షల మంది మ‌హిళ‌ల‌కు రూ.6,700 కోట్లు చొప్పున భారీ మొత్తాల‌ను పంపిణీ చేయ‌నున్నారు. 2023 జనవరిలో  వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక రూ.2,500 నుంచి రూ.2,750కి పెంచేందుకు శ్రీకారం చుట్ట‌నున్న‌ట్టు జ‌గ‌న్ వెల్ల‌డించారు.

జ‌గ‌న్ మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాలకు ఇది సంక్షేమ క్యాలెండర్ అని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు మాత్రం ఫేర్‌వెల్‌ క్యాలెండర్‌ అని చ‌మ‌త్క‌రించారు. కరోనా కారణంగా ఆదాయం తగ్గినా మన సంకల్పం ఎక్కడా చెక్కు చెద‌ర‌లేద‌న్నారు. దీక్ష మారలేద‌న్నారు. ప్రజలకు చేస్తున్న మంచి ఎక్కడా తగ్గ‌లేద‌న్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి, 44 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు తన హయాంలో  చేసింది చెప్పుకోవడానికి ఏ కోశానా ధైర్యం లేద‌న్నారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు వ‌చ్చే స‌రికి క‌రోనా ఇబ్బందులు మాత్రం గుర్తుకు రావు.

ఇదే ఇత‌ర రంగాల స‌మ‌స్య‌లు తెర‌పైకి వ‌స్తే మాత్రం క‌రోనా క‌ష్టాల‌న్నీ ఏక‌రువు పెట్ట‌డం ఈ ప్ర‌భుత్వానికి అల‌వాటైంద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. క‌నీసం ఒక్క అభివృద్ధి ప‌నికి సంబంధించైనా జ‌గ‌న్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేశారా? అనే ప్ర‌శ్న‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. అభివృద్ధి ప‌నులేవైనా చేసి వుంటే ఇలాంటి ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నం అయ్యేవి కావు. సంక్షేమ ప‌థ‌కాలే త‌న‌ను మ‌రోసారి అధికారంలోకి తీసుకొస్తాయ‌ని జ‌గ‌న్ గ‌ట్టిగా న‌మ్ముతు న్న‌ట్టున్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ చూర‌గొన్న‌ప్పుడే అధికార‌మ‌నేది కొంత కాలం నిలుస్తుంద‌ని జ‌గ‌న్ గ్ర‌హించాల్సి వుంది. ఇందుకు త‌న తండ్రి వైఎస్సార్ పాల‌న‌నే ఆయ‌న ఆద‌ర్శంగా తీసుకోవాలి.

కానీ త‌న తండ్రి వైఎస్సార్ పాల‌న‌ను జ‌గ‌న్ విస్మ‌రించిన‌ట్టు క‌నిపిస్తోంది. దివంగ‌త వైఎస్సార్ హ‌యాంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్ద‌పీట వేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల‌కు అగ్ర‌స్థానం క‌ల్పించారు. ఉదాహ‌ర‌ణ‌కు వైఎస్సార్ సొంత జిల్లా క‌డ‌ప‌నే తీసుకుందాం. క‌డ‌ప‌లో రిమ్స్‌, వైద్య‌క‌ళాశాల‌, డెంట‌ల్ క‌ళాశాల‌, ఇడుపుల‌పాయ‌లో త్రిపుల్ ఐటీ, స‌ర్వ‌రాయ సాగ‌ర్‌, పైడిపాళెం ప్రాజెక్ట్‌, పులివెందుల‌లో అంత‌ర్జాతీయ ప‌శుప‌రిశోధ‌న కేంద్రం, జేఎన్‌టీయూ, హార్టిక‌ల్చ‌ర్ కాలేజీ, డాక్ట‌ర్ వైఎస్సార్ ఇంజ‌నీరింగ్ కాలేజీ, వెట‌ర్న‌రీ కాలేజీ, యోగివేమ‌న విశ్వ విద్యాల‌యం… ఇలా ఎన్నైనా చెప్పుకోవ‌చ్చు.

ఇదే జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌, ఆర్బీకేలు మిన‌హాయించి చెప్పుకోత‌గ్గ అభివృద్ధి ప‌నులేవీ లేవు. క‌నీసం త‌న తండ్రి హ‌యాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల నుంచి కాలువ‌లు తవ్వించి పొలాల‌కు నీళ్లు అందించాల‌న్న స్పృహే ఈ ప్ర‌భుత్వంలో కొర‌వ‌డింద‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు అప్పుల చేయ‌డానికే పుణ్య‌కాలం కాస్త క‌రిగిపోతోంది.

పాల‌న అంటే అప్పులు చేయ‌డం, సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డం కాద‌ని గ్ర‌హించాల‌ని ప‌లువురు హిత‌వు చెబుతు న్నారు. అప్పు చేసి ప‌ప్పు కూడు ఎన్నాళ్లు తింటార‌నే ప్ర‌శ్న‌ల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏం స‌మాధానం చెబుతుంది? వైఎస్సార్ హ‌యాంలో తండ్రి హ‌యాంలో పోల‌వ‌రం ప్రాజెక్ట్‌కు శ్రీ‌కారం చుట్టారు. అలాగే రాయ‌ల‌సీమ‌కు గుండెకాయ లాంటి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేట‌ర్ సామ‌ర్థ్యాన్ని పెంచారు. 

జ‌గ‌న్ పాల‌న‌లో ఇలాంటివి మ‌చ్చుకైనా క‌నిపించ‌వ‌నే విమ‌ర్శ‌ల‌పై ఇప్ప‌టికైనా సీఎం దృష్టి పెట్టాలి. ఎన్నిక‌ల‌కు కేవ‌లం రెండేళ్ల గ‌డువు మాత్ర‌మే ఉంది. సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది. వ్య‌క్తుల కంటే వ్య‌వ‌స్థ సంక్షేమం ముఖ్య‌మ‌ని జ‌గ‌న్ గ్ర‌హిస్తే, పాల‌న మ‌రోలా ఉంటుంది. అది బ‌ట‌న్ నొక్క‌డం అంత సుల‌భం కాదు.