ఆయనకు ఏనుగులంటే ప్రాణం. ఎంత ప్రాణమంటే కుటుంబ సభ్యుల్ని కూడా పట్టించుకోనంత. లోకం దృష్టిలో ఆయనో పిచ్చోడు. అవును ఆయనకు ఏనుగులంటే పిచ్చి ప్రేమ. ఏనుగుల సంరక్షణ కోసం ఆయనేం చేశాడో తెలిస్తే షాక్‌కు గురవుతాం. ఇంతకూ ఆయనెవరంటే…బిహార్‌లోని అక్తర్ ఇమాం.
ఏసియన్ ఎలిఫెంట్ రిహాబిలిటేషన్ అండ్ వైల్డ్‌లైఫ్ యానిమల్ ట్రస్ట్ (ఏఈఆర్ఏడబ్ల్యూఏటీ) చీఫ్ మేనేజర్ అక్తర్ ఇమాం. 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి మోతీ, రాణీ అనే ఏనుగుల సంరక్షణ బాధ్యతలు తీసుకున్నాడు. రెండు ఏనుగులు కుటుంబ సభ్యులుగా కలిసిపోయినట్లు ఆయన చెబుతాడు. ఏనుగులు లేని జీవితాన్ని ఊహించుకోలేనంటాడతను. అంతేకాదు, ఒకానొక సందర్భంలో దుండగుల తుపాకి గుండ్ల నుంచి ఏనుగులు కాపాడినట్టు అతను చెప్పుకొచ్చాడు.
దీంతో ఆ రెండు ఏనుగులపై అతనికి మరింత ప్రేమ పెరిగింది. కన్నబిడ్డల్లా చూసుకోవడంతో, అవి కూడా అంతే ప్రేమను కనబరిచేవి. ఈ నేపథ్యంలో ఆ రెండు ఏనుగుల సంరక్షణ కోసం తన ఆస్తిలో సగ భాగంగా వచ్చే రూ.5 కోట్ల విలువైన ఆస్తిని వీలునామాగా రాశాడు. మిగిలిన సగ భాగం భార్య పేరుతో రాశాడు.
కుటుంబ సభ్యులకు ఆయన చేసిన పని ఎంత మాత్రం నచ్చలేదు. భూమిని ఏనుగుల పేరతో వీలునామా రాసినందుకు భార్య, కొడుకు తనను వదలి వెళ్లినట్లు ఆయన తెలిపాడు. ఓ తప్పుడు కేసు పెట్టి తనను జైలుకు కూడా పంపినట్టు అతను చెబుతూ వాపోయాడు. అయితే న్యాయస్థానంలో కేసులు నిలవకపోవడంతో తాను విడుదలైనట్లు చెప్పాడు. తన కుటుంబ సభ్యుల నుంచే తనకు ప్రాణాహాని ఉందన్నాడు.
ఒకవేళ ఏనుగులు మరణిస్తే ఆ ఆస్తి ఎఈఆర్ఏడబ్ల్యూఏటీ ట్రస్టుకు చెందేలా వీలునామా రాసినట్లు చెప్పాడు. మనుషుల మారిరి కాకుండా జంతువులు ఎంతో విశ్వాసమైనవని అక్తర్ అన్నాడు. తన మరణానంతరం ఏనుగులు అనాథలుగా ఉండొద్దన్న ఉద్దేశంతోనే ఆస్తిని ఏనుగుల పేర వీలునామాగా రాసినట్లు పేర్కొన్నాడు. ఏది ఏమైనా ఇలాంటి వాళ్లు కూడా లోకంలో ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే స్వార్థపూరితమైన సమాజంలో ఏనుగుల కోసం బతికే వాళ్లను ఓ కథలా చదువుకోవడం తప్ప…నిజ జీవితంలో చూడడం ఓ కలను తలపిస్తోంది. ఇలాంటి వాళ్ల గురించి తెలుసుకోవడం ఓ అద్భుత అనుభూతి.