గత ఏడాది బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా తారక్ శుభాకాంక్షలను పోస్టు చేసిన దాఖలాలు ఆయన ట్విటర్ ఖాతాలో ఏమీ కనిపించడం లేదు. అంతకు ముందు ఏడాది కూడా బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా తారక్ శుభాకాంక్షలను ట్విటర్లో పోస్టు చేయలేదు. అయితే ఈ ఏడాది మాత్రం తారక్ తన బాబాయ్ పుట్టిన రోజు సందర్భంగా ట్వీట్ చేసేశాడు. తద్వారా అనవసరమైన వివాదాలకు అవకాశం లేకుండా చేశాడని చెప్పవచ్చు.
'నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చుసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. I wish you a very Happy 60th Birthday Babai. జై బాలయ్య ! #HappyBirthdayNBK'
అంటూ తారక్ బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షల ట్వీట్ ను పోస్టు చేశాడు. ఒకవేళ గత ఏడాదిలాగానో, అంతకు ముందు ఏడాదిలాగానో బాలకృష్ణ పుట్టిన రోజున తారక్ ట్వీట్ పెట్టకపోయి ఉంటే, ఇప్పుడు మరింత రచ్చకు అవకాశం ఏర్పడేది. తెలుగుదేశం వారసత్వం విషయంలో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరమీదకు వస్తూ ఉంది. చంద్రబాబుకు వయసైపోతోంది, లోకేష్ తో జరిగే పని కాదు.. తారక్ మాత్రమే ప్రత్యామ్నాయం అనేది ఒక వాదన. ఈ క్రమంలో తారక్ పొలిటికల్ ఎంట్రీకి అటు చంద్రబాబు, బాలకృష్ణలు ఏ మాత్రం సానుకూలంగా స్పందించిన దాఖలాలు లేవు. ఇక టీడీపీతో ఇప్పటికే అంటీముట్టనట్టుగా ఉన్నాడు తారక్. ఇలాంటి నేపథ్యంలో.. బాలయ్య షష్టిపూర్తి సందర్భంగా ట్వీటేసి బాలకృష్ణతో సహృద్భావ వాతావరణమే ఉందని తారక్ చాటి చెప్పినట్టుగా అయ్యింది.
ఇక సినీ తారల్లో మహేశ్ బాబు, దేవీ శ్రీ ప్రసాద్, శ్రీకాంత్, ప్రణీత, హరిప్రియ తదితరులు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ట్విటర్ ద్వారా శుభాకాంక్షలను చెప్పారు.