కొన్ని రోజులుగా టీవీ9 గ్రూప్ తెగ హడావుడి చేస్తోంది. తమ సంస్థకు చెందిన టీవీ9తెలుగు.కామ్ అనే వెబ్ సైట్ డిజిటల్ మీడియాలో నంబర్ వన్ స్థానానికి ఎగబాకిందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తోంది. ఈ ఏడాది మే నెలలో వ్యూవర్ షిప్ బట్టి తమది అగ్రస్థానం అని చెప్పుకుంది టీవీ9.
తమ వెబ్ సైట్ కు 16.53 మిలియన్ వ్యూస్ వచ్చాయని.. తమ తర్వాతి స్థానాల్లో న్యూస్ 18 తెలుగు (13.97 మిలియిన్), సాక్షి.కామ్ (13.73 మిలియన్), టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన సమయం.కామ్ (13.16 మిలియన్), ఈనాడు.నెట్ (12.39 మిలియన్), గ్రేట్ ఆంధ్ర. కామ్ (2.03 మిలియన్), ఆంధ్రజ్యోతి (1.83 మిలియన్), బీబీసీ తెలుగు (1.1.6 మిలియన్) వెబ్ సైట్లు ఉన్నాయని ప్రకటించుకుంది.
అయితే ఇక్కడే టీవీ9 తన ''తెలివితేటలు'' ప్రదర్శించింది. కామ్ స్కోర్, మొబైల్ మ్యాట్రిక్స్, కీ మెజర్స్ రిపోర్ట్, మొబైల్ వెబ్ లాంటి వాటిని తమ సోర్స్ గా చెప్పుకొచ్చింది. తెలుగు భాషకు చెందిన పబ్లిషర్స్, తెలుగు లాంగ్వేజ్ కు సంబంధించి డిజిటల్ పాపులేషన్, యూవీలు (యూనిక్ వ్యూవర్స్) ఆధారంగా తాము నంబర్ వన్ అని చెప్పుకుంది.
నిజానికి టీవీ9 తమ స్థాయి, గొప్పదనం చాటిచెప్పడానికి ఆధారాలుగా చూపించాల్సినవి ఇవి కావు. ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన ఆథరైజ్డ్ గూగుల్ ఎనలిటిక్స్ లేదా అలెక్సా సర్టిఫైడ్ ర్యాంకింగ్స్ ను చూపిస్తే బాగుండేది.
ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన అలెక్సా ర్యాంకింగ్స్ ప్రకారం చూస్తే.. తెలుగు వెబ్ సైట్స్ లో ఈనాడు.నెట్ నంబర్ వన్ స్థానంలో ఉంది. దీని గ్లోబల్ ర్యాంక్ 1055. దీని తర్వాత సాక్షి (1168), గ్రేట్ ఆంధ్ర.కామ్ (1182), ఆంధ్రజ్యోతి (1280), గుల్టే.కామ్ (2366) ఉన్నాయి. ఈ లిస్ట్ లో టీవీ9తెలుగు.కామ్ గ్లోబల్ ర్యాంక్ 10,969.
కేవలం యూఎస్ ర్యాంకింగ్స్ ప్రకారం చూసుకుంటే.. తెలుగు వెబ్ సైట్స్ లో గ్రేట్ ఆంధ్ర.కామ్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. గ్రేట్ ఆంధ్ర యూఎస్ ర్యాంక్ 1683. ఈ సెగ్మెంట్ లో ఈనాడు (2850), గుల్టే.కామ్ (3441), ఆంధ్రజ్యోతి (5751), సాక్షి (6237) తర్వాత స్థానాల్లో నిలిచాయి.
ఈ అంచనాలు, అంకెలన్నీ చూసిన తర్వాత ఎవరు, ఎక్కడ నంబర్ వన్ స్థానంలో ఉన్నారో నిర్ణయించాల్సింది పాఠకులే.