నరసాపురం ఎంపీ రఘురామ కృష్టంరాజు అనర్హత గురించి విజయసాయి రెడ్డి మాట్లాడారు. రఘురామను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఏడాది క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ స్పీకర్ వద్ద దాఖలు చేసిన పిటిషన్ గురించి చర్చించేందుకు గురువారం (నిన్న) స్పీకర్ ఓం బిర్లాతో సహచర ఎంపీలతో కలిసి భేటీ అయినట్లు ఆయన తెలిపారు.
స్పీకర్ సూచించిన విధంగా అనర్హత పిటిషన్లో మార్పులు చేర్పులు చేసి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. అలాగే ఈ మధ్య కాలంలో రఘురామ కృష్ణంరాజు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అసభ్య పదజాలంతో చేసిన అసంబద్దమైన, చట్టవ్యతిరేక వ్యాఖ్యలకు సంబంధించిన అదనపు సాక్ష్యాధారాలను స్పీకర్‌కు సమర్పించినట్లు ఆయన తెలిపారు. అనర్హత పిటిషన్ దాఖలు చేసి ఇప్పటికే ఏడాది గడిచినందున ఇక కాలయాపన చేయకుండా తక్షణమే అనర్హతకు సంబంధించిన చర్యలకు ఉపక్రమించాలని స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు.
ఒక వేళ స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించకపోతే పార్లమెంట్లో తమ పార్టీ సభ్యులంతా ఆందోళనకు దిగుతామని ఆయనకు చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసురావలసిందిగా కూడా ఆయనను కోరినట్లు చెప్పారు. దీనిపై స్పీకర్ మాట్లాడుతూ సంబంధిత సభ్యుడికి 15 రోజుల గడువుతో నోటీసు జారీ చేసి అనంతరం ఈ పిటిషన్‌ను ప్రివిలేజస్ కమిటీకి పంపిస్తామని చెప్పినట్లు ఆయన తెలిపారు. దీనిపై స్పీకర్‌కు తమ వ్యతిరేకతను తెలిపినట్లు విజయసాయి రెడ్డి చెప్పారు.
అనర్హత పిటిషన్ దాఖలు చేసిన ఆరు మాసాలలోగా స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించాలని గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను స్పీకర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే గతంలో లోక్ సభ స్పీకర్లుగా వ్యవహరించిన రబీరే, సోమనాధ్ చటర్జీ వంటి వారు అనర్హత పిటిషన్లను ప్రివిలేజెస్ కమిటీకి పంపించకుండా తామే తుది నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడింది రఘురామ కృష్ణంరాజు. బాధితుడు ఆయన కాదు, మేము. అలాంటప్పుడు పిటిషన్‌ను ప్రివిలేజెస్ కమిటీకి పంపించడంలో ఔచిత్యం లేదని స్పీకర్‌కు స్పష్టం చేసినట్లు తెలిపారు. ప్రివిలేజ్ కమిటీ అనే కొత్త ఒరవడిని సృష్టించవద్దని ఆయనకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
స్పీకర్ తగు నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తే త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాలలో అవసరమైతే పార్లమెంట్‌ను స్తంభింపచేయడానికి కూడా తాము వెనుకాడబోమని స్పీకర్‌కు స్పష్టం చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో పార్లమెంట్లో అనుసరించబోయే కార్యాచరణను పార్టీలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. గతంలో రాజ్యసభలో జేడీయూ నుంచి బహిష్కృతులైన సభ్యులపై వారం రోజుల్లో అనర్హత వేటు పడింది. ఈ విషయాన్ని కూడా స్పీకర్ వద్ద ప్రస్తావించినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా విజయసాయి రెడ్డి చెప్పారు.
కేఆర్ఎంబీ పరిధిని నిర్దేశించాలి…
కృష్టా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్ట్‌లకు సంబంధించి కృష్టా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిని స్పష్టంగా నిర్దేశించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు విజ్ఞప్తి చేశారు.
అలాగే అన్ని ప్రాజెక్ట్‌లకు సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రతను కల్పించి చట్టం ప్రకారం వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆయన ఈ భేటీలో మంత్రికి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విజయసాయి రెడ్డి శుక్రవారం మంత్రి షెకావత్ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న చట్ట వ్యతిరేక విధానాలను ఆయన మంత్రికి వివరించారు. అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఆవశ్యకత గురించి మంత్రితో కూలంకుషంగా చర్చించి దీని నిర్మాణాన్ని అనుమతించవలసిందిగా మంత్రిని కోరారు. ఈ విజ్ఞప్తులపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు విజయసాయి రెడ్డి చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం కృష్టా జలాల ఆధారంగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి, దిండి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల విస్తరణ, శ్రీశైలం ఎడమ కాలువ విస్తరణ వంటివి ఏ విధంగా చట్ట విరుద్ధమైనవో మంత్రికి సోదాహరణంగా వివరించినట్లు చెప్పారు.
ఏలేశ్వరం నుంచి విశాఖ జిల్లాకు త్రాగు నీరు….
విశాఖపట్నం జిల్లా గ్రామీణ ప్రాంతాల ప్రజల తాగు నీటి అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లాలోని ఏలేశ్వరం నుంచి విశాఖ జిల్లాలోని నరవ వరకు పైపు లైన్ ద్వారా తాగు నీటిని తరలించే ప్రాజెక్ట్‌ను తలపెట్టినట్లు విజయసాయి రెడ్డి చెప్పారు. 126 కిలో మీటర్ల దూరం పైపు లైన్ ద్వారా 12 టీఎంసీల తాగు నీటిని తరలించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కు 3573 కోట్లు ఖర్చవుతుంది. దీనికి సంబంధించి డీపీఆర్ కూడా సిద్ధమైంది.
జల్ జీవన్ మిషన్ కింద ఈ ప్రాజెక్ట్ వ్యయంలో సగం భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని చేసిన అభ్యర్ధనకు జల్ శక్తి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు.