తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆ పార్టీకి వరస రాజీనామాలు చోటు చేసుకుంటూ ఉండటం గమనార్హం. గత ఎన్నికల్లోనే చంద్రబాబు నాయుడుకు అక్కడ మెజారిటీ బాగా తగ్గిపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు స్థానిక నేతలు కూడా టీడీపీకి రాజీనామా చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గతంలో అప్పుడప్పుడు అయినా కుప్పం వైపు తొంగి చూసే వారు. ఏడాదికోసారి కుప్పానికి వెళ్లి చంద్రబాబు నాయుడు హడావుడి చేసేవారు. అయితే ఇప్పుడు అలాంటిది కూడా ఏమీ లేకుండా పోయింది.
ఎన్నికలైపోయి ఏడాది గడుస్తున్నా చంద్రబాబు నాయుడు కుప్పం మీద దృష్టి సారించింది లేదు. కరోనా భయాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. ఎంత కరోనా ఉన్నా సామాన్యులు గత నాలుగైదు నెలల్లో సొంతూళ్ల వైపు చూస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం హైదరాబాద్ దాటడం లేదు. నియోజకవర్గం ఎమ్మెల్యేగా అయినా అక్కడ పరిస్థితి ఏమిటనేది సమీక్షిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.
ఈ క్రమంలో గత కొంతకాలంలోనే కుప్పం టౌన్ టీడీపీ అధ్యక్షుడు, కుప్పం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఒకరు, నియోజకవర్గంలోని పంచాయతీల ప్రెసిడెంట్లు, ఇతర స్థానిక నేతలు ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. నియోజకవర్గంతో చంద్రబాబు నాయుడుకు పెద్దగా సంబంధాలు ఉన్న పరిస్థితి లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో చేతులు కాలుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అక్కడి నాయకులకు ఫోన్లు చేస్తున్నారని, ఎవ్వరూ పార్టీని వీడి వెళ్లడానికి లేదని వారికి తనదైన భరోసాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. అయినా రాజకీయాలు అంటే ఫోన్లలో, జూమ్ వీడియో కాల్స్ లో తేలేవి కావని వేరే చెప్పనక్కర్లేదేమో! ఎంత చంద్రబాబు నాయుడు అయినా.. ఫోన్లతో, వీడియో కాల్స్ తో తన పార్టీ శ్రేణులకు ఏం భరోసా ఇస్తారు?