టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ఆగడాలను మొదటి నుంచి సమర్థవంతంగా ఎదుర్కొంటున్న బీజేపీ నేతల్లో జీవీఎల్ నరసింహారావుది అగ్రస్థానం. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా, అన్నిటికి మించి ఆంధ్రప్రదేశ్ వాసిగా రాష్ట్ర సమస్యలు, చంద్రబాబు ఆరోపణలపై జీవీఎల్ స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. అందుకే జీవీఎల్ అంటే టీడీపీకి కొరకరాని కొయ్యగా మారారు.
ఎన్నో వ్యవస్థల్ని అలవోకగా మేనేజ్ చేసిన చంద్రబాబుకు…జీవీఎల్‌ను మేనేజ్ చేయడం ఎందువల్లో సాధ్యం కాలేదు. దీంతో గత సార్వత్రిక ఎన్నికల ముందు జీవీఎల్‌పై తన మీడియా అండతో అన్ని రకాల దాడికి యత్నించి విఫలమయ్యారు. మూడు రాజధానుల అంశంపై కూడా బీజేపీలో గందరగోళం సృష్టించేందుకు టీడీపీ పన్నిన కుట్రలను జీవీఎల్ సమర్థవంతంగా తిప్పి కొట్టారు.
తాజాగా ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్‌హాట్‌గా నడుస్తోంది. ఓ పచ్చ కరపత్రికలో వచ్చిన కథనం ఆధారంగా దానిపై హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది. అంతకు ముందు రోజు ప్రధాని మోడీకి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్ ట్యాపింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తన నివాసంలో జీవీఎల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయస్థానాలకు ప్రతిపక్షనేత చంద్రబాబు సాయం అవసరం లేదని తేల్చి చెప్పారు.
వ్యవస్థల గురించి అందరికంటే ఎక్కువగా చంద్రబాబుకే తెలుసని జీవీఎల్ చెప్పారు. లోతైన ఈ మాటలు ఎవరికెలా అర్థం కావాలో అలా అర్థమయ్యాయి. వ్యవస్థల్లో లేని వాటిని కూడా ఆయన తనకు అనుకూలంగా చెప్పుకున్న రోజులున్నాయని ఎద్దేవా చేశారు. బాబు హయాంలో సీబీఐని రాష్ట్రానికి రానివ్వకుండా చేశారని గుర్తు చేశారు.
లేఖలో తన ఫోన్ ట్యాప్ అవుతోందని చెప్పలేదని జీవీఎల్ తప్పు పట్టారు. 2015లో ఆయన ఫోన్ ట్యాప్ అయితే రాష్ట్రమంతా మారుమోగిందని అవహేళన చేశారు. చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలని లక్ష్మీపార్వతి 2005లో దాఖలు చేసిన పిటిషన్‌పై 14 ఏళ్లుగా స్టే ఉందని జీవీఎల్ గుర్తు చేశారు. ఇదొక గిన్నీస్ బుక్‌లో చేర్చాల్సిన అంశమని పంచ్ విసిరారు.
ఇన్నేళ్ల పాటు ఏ రకంగా స్టే ఇచ్చారన్నది చాలా ప్రధానమైన అంశమని జనంలో ఓ ఆలోచన రేకెత్తించే ప్రయత్నం జీవీఎల్ చేశారు. జీవీఎల్ ప్రెస్మీట్లో చంద్రబాబుపై స్టేల గురించి విసిరిన పంచ్ పేలిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ మాటలే వైరల్ అయ్యాయి. జీవీఎల్లా మజాకా!