రైల్వే జోన్ కి ఫీజిబిలిటీ లేదట…?

విశాఖ రైల్వే జోన్ విషయం ఎన్ని వంకర్లు తిరగాలో అన్నీ తిరుగుతోంది. దాన్ని అలా పెద్దలు తిప్పుతున్నారు కూడా. విశాఖ రైల్వే జోన్ కి లేటెస్ట్ బడ్జెట్ లో కూడా నిధుల కేటాయింపు అన్నది…

విశాఖ రైల్వే జోన్ విషయం ఎన్ని వంకర్లు తిరగాలో అన్నీ తిరుగుతోంది. దాన్ని అలా పెద్దలు తిప్పుతున్నారు కూడా. విశాఖ రైల్వే జోన్ కి లేటెస్ట్ బడ్జెట్ లో కూడా నిధుల కేటాయింపు అన్నది లేదు. దాంతో ఇక రైల్వే  జోన్ లేనట్లే రానట్లే అని అంతా ఫిక్స్ అయిపోయారు.

ఆ మీదట బీజేపీ వినా ఇతర పక్షాలు మండిపోతున్నాయి కూడా. మరో వైపు విశాఖ రైల్వే జోన్ మీద మళ్లీ ఉద్యమిస్తామని వామపక్షాలు హెచ్చరించాయి. ఇలాంటి టైమ్ లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సడెన్ గా సీన్ లోకి వచ్చారు. విశాఖ రైల్వే జోన్ ఎక్కడికీ పోలేదని, అది వస్తుందని అంటున్నారు.

త్వరలో రైల్వే జోన్ అంటూ ఆయన జనాలకు ఆసక్తిని కలిగిస్తూ ప్రకటించేశారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాటలు ఒకసారి పరిశీలిస్తే జోన్ నిజంగా వస్తోందా లేక రాదా అన్నది కూడా చర్చగానే ఉంది. జీవీఎల్ మాటలలోనే చూస్తే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు వల్ల ఆర్ధికంగా, ఇతరత్రా కూడా ఏ కోశానా ఫీజిబిలిటీ లేదట. ఇలా విశాఖ జోన్ ఏర్పాటు వల్ల పూర్తిస్థాయి ఫీజిబిలిటీ లేదని ఈ రోజుకి కూడా రైల్వే బోర్డు, రైల్వే శాఖలో ఆలోచన ఉందని ఒక రకంగా బాంబు లాంటి వార్తనే జీవీఎల్ చెప్పారు.

అయినప్పటికీ ప్రధాని మోడీ ఇచ్చిన హామీ మేరకు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి అడుగులు ముందుకు పడుతున్నాయని అంటున్నారు. రైల్వే జోన్ కి సంబంధించి డీపీయార్ అయితే రెడీగా ఉందని, దాన్ని ఆమోదించిన మీదట జోన్ ప్రక్రియ చేపడతామని అంటున్నారు.

జోన్ లో భాగంగా ముందుగా భవనాల నిర్మాణం జరుగుతుంది అని కూడా చెబుతున్నారు. మొత్తానికి జోన్ వస్తుందని చెబుతూనే ఫీజిబిలిటీ లేదని జీవీఎల్ అనడమే విశేషం. మరి లాభం కాకపోతే ఉన్న వాటికే ప్రైవేట్ పరం చేస్తూ పోతున్న మోడీ సర్కార్ విశాఖ రైల్వే జోన్ నిజంగా ఏర్పాటు చేస్తుందా అన్నదే అతి పెద్ద డౌట్ గా అందరిలో ఉంది. 

ఏది ఏమైనా జీవీఎల్ చెప్పినట్లుగా డీపీయార్ ఆమోదించి జోన్ కి సంబంధించి ప్రక్రియ మొదలెట్టేసరికి 2024 ఎన్నికలు కూడా వచ్చేస్తాయేమో. ఏతా వాతా తేలేది ఏంటి అంటే విశాఖ రైల్వే జోన్ మరోసారి ఎన్నికల హామీగా మారబోతోందా అన్నదే. చూడాలి మరి.