గుమ్మడి కాయలు దొంగంటే భుజాల తడుముకున్న సామెత బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాటలు గుర్తు చేస్తున్నాయి. బీజేపీపై ఏపీ పాలక ప్రతిపక్షల పార్టీలు విమర్శలు చేయడానికి ఏ మాత్రం సాహసించడం లేదు.
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబులపై సోము వీర్రాజు మొదలుకుని బీజేపీలోని అన్ని స్థాయి నాయకులు రోజూ విమర్శలు చేస్తుంటారు.
ఇక విమర్శలు శ్రుతి మించాయని భావించిన సందర్భాల్లో మంత్రి కొడాలి నాని , మాజీ మంత్రి జవహర్ లాంటి నాయకులు కౌంటర్స్ ఇస్తుంటారు. బహుశా ఏపీలో మాదిరిగా మరే రాష్ట్రంలో కూడా రాజకీయ పరిస్థితులు ఉండవు.
కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీతో శత్రుత్వం కంటే స్నేహమే బెటర్ అనే భావనలో పాలక ప్రతిపక్ష పార్టీలు రాజకీయ చేస్తుండడంతో, బీజేపీ నేతల విమర్శలకు హద్దు లేకుండా పోతుంది. అంతేకాదు, ఏపీకి బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని కూడా ప్రశ్నించలేని దుస్థితి.
ఈ నేపథ్యంలో తిరుపతిలో బీజేపీ జాతీయ నాయకుడు జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ దుబ్బాకలో బీజేపీ ప్రభంజనంతో భయపడుతున్న రాజకీయ పార్టీలు …బీజేపీ, జనసేన మధ్య దూరం పెంచేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు.
జీవీఎల్ ఆరోపణలకు బీజేపీ-జనసేన శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి. ఎందుకంటే మిత్రపక్షాలైన ఆ రెండు పార్టీలు తిరుపతి ఉప ఎన్నికలో తలపడేందుకు నేనంటే నేను అని పట్టుదలకు పోతున్న విషయం అందరికీ తెలిసిందే. తన సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతంలో జనసేన అభ్యర్థే ఉండాలని పవన్‌కల్యాణ్ భావిస్తున్నారు.
దుబ్బాక విజయంతో జోష్ మీద ఉన్న బీజేపీ… ఏపీలో బలపడేందుకు తిరుపతి లోక్‌సభ స్థానానికి పోటీ చేయడమే సరైన సమయమని గట్టిగా నమ్ముతోంది. అందుకే మిత్రపక్షమైన జనసేన డిమాండ్‌ను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఉప ఎన్నిక వ్యూహ రచనలో బీజేపీ నేతలు తలమునకలై ఉన్నారు.
కేవలం తమను సపోర్ట్ పార్టీగా మాత్రమే బీజేపీ భావించడంపై జనసేనాని అసంతృప్తిగా ఉన్నారనే వార్తలొస్తున్నాయి. ఇందులో ఇతరులు దూరం పెంచాల్సిన పరిస్థితతే ఉత్పన్నం కాదు.
అలాగే అభివృద్ధి గురించి జీవీఎల్ చాలా గొప్పలు చెబుతున్నారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి అంతా తామే చేశామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తిరుపతి స్మార్ట్ సిటీ , ఐఐటీ, ఐజర్, ఫేమ్ ఇండియా, ఇండస్ట్రియల్ కారిడార్ తదితర ఎన్నో ప్రాజెక్టులను బీజేపీ తీసుకొచ్చినట్టు జీవీఎల్ చెప్పుకొచ్చారు.
కానీ ఆయన చెబుతున్న అభివృద్ధి ప్రాజెక్టుల్లో అన్నీ కూడా విభజిత చట్టంలో పేర్కొన్నవి. ఏ ఒక్కటీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టింది లేదు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని సాక్షిగా తిరుపతి వేదిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని నాటి ప్రధాని అభ్యర్థిగా మోడీ ఇచ్చిన హామీ ఏమైందో జీవీఎల్ సమాధానం చెప్పాలి. అలాగే వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్రలోని మొత్తం ఏడు జిల్లాలకు విభజిత చట్టంలో ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ఏమైందో కూడా జీవీఎల్ సమాధానం చెప్పాలి.
తిరుపతి ఉప ఎన్నికలో తలపడేందుకు ఉత్సాహ పడుతున్న బీజేపీని ప్రజలు ఇవన్నీ అడుగుతారనే భయంతో జీవీఎల్ భయపడుతున్నట్టు కనిపిస్తోంది. పొంతన లేని అంశాల్ని తెరమీదకు తెచ్చేందుకు బీజేపీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి బీజేపీకి మాట్లాడే నైతిక హక్కు వుందో లేదో ఆ పార్టీ నేతలు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే… ఇలా భుజాలు తడుముకోవాల్సిన అవసరం రాదు.