అప్పుడు కేకు.. ఇప్పుడు లేఖ.. పవన్ పడతాడా?

పవన్ కల్యాణ్ పై వైసీపీ తీవ్ర విమర్శలను అటు టీడీపీ కానీ, ఇటు బీజేపీ కానీ ఎవరూ పట్టించుకోలేదు. జీవీఎల్ లాంటి నేతలు మినహా ఇంకెవరూ పవన్ కి మద్దతిచ్చే సాహసం చేయలేదు. అటు…

పవన్ కల్యాణ్ పై వైసీపీ తీవ్ర విమర్శలను అటు టీడీపీ కానీ, ఇటు బీజేపీ కానీ ఎవరూ పట్టించుకోలేదు. జీవీఎల్ లాంటి నేతలు మినహా ఇంకెవరూ పవన్ కి మద్దతిచ్చే సాహసం చేయలేదు. అటు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా స్పందన శూన్యం. ఈ దశలో కాసేపు పవన్ భజన చేసింది కాపు సంక్షేమ సేన. భ'జనసేన'ను మరిపించింది.  పవన్ కల్యాణ్ ను అవమానించడం అంటే, కాపు సమాజాన్ని అవమానించడమేనని, దీనికి జగన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.

ఈమేరకు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య ఓ లేఖ విడుదల చేశారు. కాపు మంత్రులు పవన్ కల్యాణ్ ని తిట్టడం వెనక జగన్ హస్తముందని ఆరోపించారు. అంతా బాగానే ఉంది కానీ.. పవన్ ని అవమానిస్తే, కాపుల్ని అవమానించినట్టేనని ఎందుకు అనుకోవాలి. 

అసలు ముందుగా సన్నాసి అనే పద ప్రయోగం మంత్రి పేర్నినానిపై పవన్ చేశారు కదా. అప్పుడెందుకు కాపు సమాజానికి అవమానంగా తోచలేదు. పవన్ తిడితేనే.. వైసీపీ మంత్రులు కౌంటర్లు ఇచ్చారు. ఇక్కడే అవమానం తెరపైకి వచ్చిందా..?

జోగయ్య గాలానికి పవన్ పడతారా..?

రిటైర్మెంట్ స్టేజ్ దాటినా కూడా ఇంకా ఏదో చేయాలనే తపన హరిరామ జోగయ్యలో కనిపిస్తోంది. దాన్ని ఎవరూ కాదనరు. అయితే కులాన్ని అడ్డు పెట్టుకుని ఆయన చేయాలనుకుంటున్న ప్రయత్నాలు ఫలించేలా లేవు. గతంలో ప్రజారాజ్యంలో కూడా ఇలాగే కులాల కుంపటి రగిల్చారు జోగయ్య. ఆ తర్వాత వైసీపీలో చేరి హంగామా చేశారు. ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ ఆధ్వర్యంలో కాపులను ఏకం చేసి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆయన ఆలోచన.

గతంలో కూడా పవన్ కల్యాణ్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు పెద్దాయన. పవన్ బర్త్ డే కి కూడా నానా హంగామా చేశారు. కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో పవన్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించడమే కాకుండా.. భారీ ప్రచారం కూడా చేసుకున్నారు. దానికి ఇండస్ట్రీ నుంచి మరికొంతమంది కాపు టెక్నీషియన్స్, నటుల్ని కూడా ఆహ్వానించారు. కానీ ఆ ప్లాన్ వర్కవుట్ కాలేదు. 

పవన్ ఎప్పుడూ ఈ రిటైర్డ్ పొలిటీషియన్ ని పట్టించుకోలేదు. ఆయన వల్ల తనకు ఏమాత్రం లాభం లేదని, కేవలం కాపు సంక్షేమ సేన పేరుతో ఆయన హడావిడి చేస్తున్నారనే విషయం పవన్ కి బాగా తెలుసు. అందుకే ఆయన అంటీముట్టనట్టుగా ఉన్నారు. 

కానీ ఈ దశలో తనకి వంతపాడుతూ, జగన్ ని తిడుతూ.. లేఖ రాసిన ఏకైక మద్దుతదారుడిని పవన్ పట్టించుకోకుండా ఉండలేరు. మరి పవన్ ఇకపై కాపు రాజకీయాలు చేస్తారా.. ? కాపు సంక్షేమ సేనతో జనసేన కలసినడుస్తుందా..? ఈ ఎపిసోడ్ లో జోగయ్య రాజకీయ లాభం ఎంత..? అనేవి తేలాల్సి ఉంది.