చిరంజీవిని మరోసారి హీరోను చేసిన పోసాని..!

ప్రెస్ మీట్ లో పవన్ కల్యాణ్ ని తిడుతూనే చిరంజీవిపై తనకున్న స్వామి భక్తిని చూపించారు పోసాని కృష్ణమురళి. పవన్ ఫ్యాన్స్ ని బూతులు తిడుతూనే, చిరు ఫ్యాన్స్ ని తనవైపు లాగేసుకునే ప్రయత్నం…

ప్రెస్ మీట్ లో పవన్ కల్యాణ్ ని తిడుతూనే చిరంజీవిపై తనకున్న స్వామి భక్తిని చూపించారు పోసాని కృష్ణమురళి. పవన్ ఫ్యాన్స్ ని బూతులు తిడుతూనే, చిరు ఫ్యాన్స్ ని తనవైపు లాగేసుకునే ప్రయత్నం చేశారు. పవన్ ఫ్యాన్స్ ని రెచ్చగొడుతూనే, బన్నీ ఫ్యాన్స్ వేరు అంటూ మాట్లాడారు. ఇప్పటివరకూ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న చాలా అంశాలను పోసాని నేరుగా బయటపెట్టేశారు.

రాజకీయాల్లో చిరంజీవి అనుకున్నవన్నీ సాధించకపోవచ్చు కానీ ఉన్నన్ని రోజులు హుందాగానే రాజకీయాలు చేశారని, విమర్శలు, ప్రతి విమర్శల విషయంలో ఆయన రేంజ్ ఆయన కాపాడుకున్నారని అంటారు. 

రాజకీయాల్లో గతంలో తనకు ప్రత్యర్థి అయినా, సీఎం జగన్ ని కలసినప్పుడు కూడా ఆయన హుందాగానే ప్రవర్తించారు. కానీ పవన్ అలా కాదు. సీఎం జగన్ ని పవన్ సంబోధించే తీరే వేరు. జగన్ రెడ్డీ అంటూ దీర్ఘం తీస్తాడు. వైసీపీ మంత్రులు పవన్ నాయుడు అంటే మాత్రం అది తప్పంటాడు.

ఇక సినిమాల వ్యవహారానికొస్తే.. ఇండస్ట్రీ కష్టాల్లో ఉంది ఆదుకోవాలంటూ లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి వైసీపీ ప్రభుత్వాన్ని కోరారు. ఆ వెంటనే తెలుగు సినీ పెద్దలు వెళ్లి మంత్రి పేర్ని నానిని కలవడం, చర్చలు జరపడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే రిపబ్లిక్ సినిమా వేడుకలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు దీనికి పూర్తి భిన్నంగా సాగాయి. 

చిరంజీవి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తే, పవన్ ఆ సమస్యకు పీటముడి వేసి పెట్టేశారు. తెగేదాకా లాగారు. మొత్తంగా తెలుగు ఇండస్ట్రీని చిక్కుల్లో పడేశారు.

చిరంజీవి అదీ..

గతంలో చిరంజీవిపై నిర్మాత బెల్లంకొండ సురేష్ చేసిన వ్యాఖ్యలకు మెగా అభిమానులు నొచ్చుకున్నారని, వారు సురేష్ ఆఫీస్ పై దాడికి వెళ్లే క్రమంలో చిరంజీవి వారిని తిట్టి వెనక్కు పంపించేశారని పోసాని తన ప్రెస్ మీట్ లో గుర్తు చేశారు. 

చిరంజీవి అంటే అదీ అంటూ మెగాస్టార్ ని ఆకాశానికెత్తేశారు. గతంలో చిరు ఫ్యామిలీ గురించి కేశినేని నాని చేసిన వ్యాఖ్యల సమయంలో తాను చిరంజీవికి అండగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

పవన్ ఇదీ..

పవన్ కల్యాణ్ మాత్రం గిట్టనివారి పైకి జనసైనికుల్ని ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు పోసాని. పవన్ ఫ్యాన్స్ ఇతర హీరోల సినిమా ఫంక్షన్లకు వచ్చి ఎంత రచ్చ చేస్తారో అందరికీ తెలిసిన విషయమేనన్నారు. చెప్పను బ్రదర్ అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ ని గుర్తు చేశారు. 

నాగబాబు కూడా ఓ దశలో పవర్ స్టార్ స్లోగన్స్ కి విసిగిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. మొత్తంగా పవన్ తన అభిమానుల్ని కంట్రోల్ లో పెట్టుకోరని, ప్రత్యర్థులపైకి వారిని ఉసిగొల్పేది పవనేనని ఆరోపించారు.

సినిమాల్లోనూ, రాజకీయల్లోనూ పవన్ కీ చిరంజీవికీ ఉన్న వ్యత్యాసాన్ని క్లియర్ కట్ గా చెప్పేశారు పోసాని కృష్ణమురళి. పవన్ తన ఫ్యాన్స్ ని రెచ్చగొడతారని, చిరంజీవి ఫ్యాన్స్ ని హద్దుల్లో ఉండేలా చూసుకుంటారని వివరించారు. పరోక్షంగా పవన్ కంటే చిరు వెయ్యి రెట్లు బెటర్ అని తేల్చేశారు పోసాని.