రాజకీయ వ్యవస్థే భ్రష్టు పట్టిందనే విషయం అందరూ అంగీకరిస్తారు. అయితే అందులో కూడా ఎక్కువ తక్కువల గురించి చెప్పుకుంటారు. రాజకీయాల్లో ప్రత్యర్థులే తప్ప శత్రువు ఉండరని చెబుతారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పోల్చుకుంటే తెలంగాణలో ఇంకా అంత చెడిపోలేదనే అభిప్రాయాలు ఎక్కువే.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణల స్థాయి దాటి చాలా ఏళ్లే అయింది. నోరెత్తితే తిట్లు, శాపనార్థాలు, బూతులు …చెప్పుకోడానికే సిగ్గేస్తుంది. పాలక ప్రతిపక్ష నేతలు పరస్పరం కలిసి ఏదైనా కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఆంధ్రాలో అసలు ఊహించలేం.
అంతెందుకు స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత … ఆయన స్థానంలో గౌరవంగా కూచోపెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు వెళ్లడం సంప్రదాయం. కానీ చంద్రబాబు వెళ్లకుండా మరో సభ్యుడిని పంపడం చట్టసభలో విమర్శలకు దారి తీసింది.
ప్రస్తుతానికి వస్తే తెలంగాణలో ఓ మంచి సంప్రదాయానికి పాలక ప్రతిపక్ష పార్టీలు గురువారం తెరలేపాయి. సహజంగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం చూశాం. కానీ కాంగ్రెస్ పక్షనేత భట్టి విక్రమార్క శాసనసభలో లక్ష ఇళ్ల నిర్మాణంపై విమర్శలు చేశారు. రాజధానిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎక్కడ నిర్మించారో చూపాలని సవాల్ విసిరారు. భట్టి సవాల్‌ను తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు.
నిర్మాణాలను స్వయంగా చూపించేందుకు గురువారం ఉదయం బంజారాహిల్స్‌లోని భట్టి విక్రమార్క ఇంటికి మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్ వెళ్లారు. మంత్రి తన కారులోనే భట్టిని వెంట పెట్టుకుని ఇళ్ల నిర్మాణాల పరిశీలనకు వెళ్లారు. మొదట జియాగూడలోని ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో పాలక ప్రతిపక్ష నేతలు కలిసి వెళ్లడం చూడ ముచ్చటగా, ఆరోగ్యకరమైన రాజకీయాలకు నిదర్శనంగా చెబుతున్నారు. ఇలాంటి వాతావరణం ఆంధ్రాలో కనీసం కలలోనైనా ఊహించగలమా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.