మైక్ దొరికితే చాలు, సుద్దులు చెప్పేయాలనుకుంటే ఎలా.? కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధరీశ్వరి.. బీజేపీ హయాంలో కమలం కండువా కప్పుకుని బీజేపీ నేతగా ఆంధ్రప్రదేశ్‌లో హల్‌చల్ చేసేస్తున్నారు. విశాఖ నుంచి లోక్‌సభకు గతంలో ప్రాతినిథ్యం వహించి, కేంద్ర మంత్రిగా కూడా అవకాశం దక్కించుకున్న పురంధరీశ్వరి, తనను గెలిపించిన విశాఖ ప్రజానీకం, ప్రత్యేక రైల్వే జోన్ కోసం నెత్తీనోరూ బాదుకుంటోంటే ఏనాడూ పట్టించుకోలేదాయె. తలకాయ లేని రైల్వే జోన్‌ని నరేంద్ర మోడీ సర్కార్ ప్రకటిస్తే, ఆ విషయమ్మీద కూడా ఇప్పటిదాకా పెదవి విప్పడంలేదామె.
ప్రత్యేక హోదా విషయంలో మాత్రం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 'సుద్దులు' చెబుతున్నారు పురంధరీశ్వరి. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని అంటున్నారు ఈ మాజీ కేంద్ర మంత్రి. ప్రత్యేక హోదా గురించి వైఎస్ జగన్ నినదించడంలో అర్థమే లేదని తేల్చేశారు. చంద్రబాబులా వైఎస్ జగన్ కూడా రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ గొంతు చించేసుకుంటున్నారు పురంధరీశ్వరి.
మైక్ దొరికితే చాలు, అడ్డగోలుగా మాట్లాడేస్తాం.. అని అనుకుంటే ఎలా.? గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె, తాను కేంద్ర మంత్రిగా వున్నప్పుడే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాని అప్పటి ప్రభుత్వం ప్రకటించిందని మర్చిపోకూడదు. అఫ్‌కోర్స్, రాజకీయాల్లో తిన్నింటి వాసాలు లెక్కెడితేనే ఎదుగుదల.. అన్న విషయాన్ని బాగా వంటబట్టించేసుకున్నారనుకోండి పురంధరీశ్వరి.. అది వేరే సంగతి.
ప్రత్యేక హోదా విషయంలో ఏం చేయాలన్నదానిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్పష్టత వుంది. అసెంబ్లీలో తూతూ మంత్రంగా ప్రత్యేక హోదాపై తీర్మానం చేసెయ్యలేదు వైఎస్ జగన్ ప్రభుత్వం. 22 మంది ఎంపీలతో ఎప్పుడెలా లోక్‌సభలో పోరాటం చేయించాలో వైఎస్ జగన్‌కి బాగా తెలుసు. పురంధరీశ్వరి నుంచి 'సుద్దులు' నేర్చుకోవాల్సిన ఖర్మ అయితే వైఎస్ జగన్‌కి పట్టలేదని నిస్సందేహంగా చెప్పొచ్చు.