ప్రపంచ బ్యాంకు.. చంద్రబాబు ‘బొంకు’.!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనకు తాను ఇచ్చుకున్న సర్టిఫికెట్‌ 'నిప్పు' అని. కానీ, రాజకీయ ప్రత్యర్థుల దృష్టిలో చంద్రబాబు ప్రపంచ బ్యాంకు జీతగాడు.! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో చంద్రబాబు…

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనకు తాను ఇచ్చుకున్న సర్టిఫికెట్‌ 'నిప్పు' అని. కానీ, రాజకీయ ప్రత్యర్థుల దృష్టిలో చంద్రబాబు ప్రపంచ బ్యాంకు జీతగాడు.! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో చంద్రబాబు మీద పడ్డ అతి పెద్ద మచ్చ అది. ఆ మచ్చని చంద్రబాబు తన జీవితకాలంలో ఎప్పుడూ చెరిపేసుకునే అవకాశమే లేదు. పైగా, ఆయన అప్పటికీ.. ఇప్పటికీ.. ప్రపంచ బ్యాంకు విషయంలో తన వైఖరిని మార్చుకోలేదు.. మార్చుకోరు కూడా.! 

ప్రపంచ బ్యాంకు ఏజెంట్‌.. ప్రపంచ బ్యాంకు జీతగాడు.. ఇలా చంద్రబాబు 'ప్రపంచ బ్యాంకు' ట్యాగ్‌లైన్‌తో సంపాదించుకున్న పేర్లు అన్నీ ఇన్నీ కావు. చంద్రబాబుకి ఎందుకోగానీ.. ప్రపంచ బ్యాంకు అంటే భలే ఇష్టం. ఆ ప్రపంచ బ్యాంకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామనడం చంద్రబాబుకి నచ్చడంలేదు. చంద్రబాబు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే.. ప్రపంచ బ్యాంకు రుణాల్ని ఇచ్చేది రాష్ట్రానికి తప్ప, వైఎస్‌ జగన్‌ వ్యక్తిగత అవసరాల కోసం కాదు. 

చంద్రబాబు తన హయాంలో రాష్ట్రం కోసమే ప్రపంచ బ్యాంకుతో చేతులు కలిపారా.? తన వ్యక్తిగత ప్రాపకం పెంచుకోవడం కోసం ప్రపంచ బ్యాంకు ఏజెంటుగా చంద్రబాబు మారారా.? అన్నది వేరే చర్చ. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కారణంగానే, అమరావతి విషయంలో ప్రపంచ బ్యాంకు వెనక్కి తగ్గిందన్నది చంద్రబాబు ఉవాచ. 'మీ నిర్వాకం వల్లనే ఈ దుస్థితి..' అంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో చంద్రబాబుని కడిగేశారాయె. దాంతో, చంద్రబాబు ఓ రేంజ్‌లో బుకాయించేస్తున్నారు. 

'బొంక'డానికి చంద్రబాబు అస్సలేమాత్రం తడుముకోరన్నది అందరికీ తెల్సిన విషయమే. ఇప్పుడు ఆయన అదే పని చేస్తున్నారు. ఇందులో ఆశ్చర్యపోవడానికేమీ లేదు. రాజధాని విషయంలో చంద్రబాబు గ్రాఫిక్స్‌లు మనిషన్నవాడెవడూ నమ్మే పరిస్థితి లేదన్నది నిర్వివాదాంశం. అలాంటిది, ప్రపంచ బ్యాంకు సైతం ఎందుకు నమ్ముతుంది.? కేంద్రం కూడా ఈ విషయమై ఖచ్చితమైన అభిప్రాయంతో వుంది. దాంతో, అటు కేంద్రానికి ఇష్టంలేని విషయంపై ప్రపంచ బ్యాంకు మాత్రం ఎలా ఇష్టపడుతుంది.? 

ప్రతి విషయంలోనూ ఒకటే వితండ వాదం. ఆరు నెలలు ఆగితే.. చంద్రబాబుకి కాస్తంత గౌరవం అయినా మిగిలేది. నెల రోజులకే కంగారుపడి.. భుజాలు తడిమేసుకుంటూ.. చంద్రబాబు ప్రదర్శిస్తున్న తొందరపాటు, తెలుగుదేశం పార్టీని ఇంకాస్త తొందరగానే ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఖాళీ చేసేలా వుందండోయ్‌.!