బిడ్డల కంటే ఏ తల్లిదండ్రులకు ఏదీ ఎక్కువ కాదు. పిల్లల ఉన్నతిని కాంక్షించే తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఉంటారు. బిడ్డలు ప్రయోజకులు అయిన తర్వాత జీవితంలో తాము పడ్డ రెక్కల కష్టాన్ని మరిచిపోతారు. ఉన్నత స్థానంలో ఉన్న బిడ్డలను చూస్తూ మురిసిపోతారు. బిడ్డలే లోకంగా మనిషి ఒక చోట…మనసు మరో చోట అనే రీతిలో కాలం వెళ్లదీస్తుంటారు. అయితే అనుకోని విపత్తు సంభవించి బిడ్డ తుది శ్వాస విడిస్తే…పంచ ప్రాణాలు పెట్టుకున్న, తన రక్తం పంచుకున్న బిడ్డ శవాన్ని కూడా చూసేందుకు రాలేని అవస్థలో ఓ తండ్రి ఉంటే…దాన్ని భరించగలమా? చివరికి బిడ్డ అంతిమ సంస్కార యాత్రను వాట్సప్ కాల్‌లో చూడాల్సిన దయనీయ స్థితిని తెలియజేసే…ప్రతి గుండెను పిండేసే ఆ వార్త గురించి తెలుసుకుందాం.
సాహిత్య….ఓ పేద దంపతుల ముద్దుబిడ్డ. జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం తుంగూరుకి చెందిన పాలాజీ భాస్కర్, సునీత దంపతుల గారాలపట్టి సాహిత్య. చక్కని రూపు, చలాకీగా గెంతులేసే ఆ 11 ఏళ్ల సాహిత్యని మధుమేహం కొంత కాలంగా పీడిస్తోంది. ఎన్నో చోట్ల వైద్యం అందించారు. శక్తికి మించి పాప వైద్యానికి ఖర్చు చేశారు. దీంతో తలకు మించిన అప్పులయ్యాయి.
అప్పులు తీర్చడంతో పాటు కుటుంబ పోషణ నిమిత్తం పొట్ట చేత పట్టుకుని సాహిత్య తండ్రి భాస్కర్ ఐదు నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ సంపాదించే సొమ్ముతో పాప వైద్యానికి, ఇంటి ఖర్చులకు పంపేవాడు. పాప ఆరోగ్యంలో మాత్రం మార్పు కనిపించలేదు. పరిస్థితి విషమించి శుక్రవారం పాప అనంతలోకాలకు వెళ్లిపోయింది.
ఈ విషయం దుబాయ్‌లో ఉన్న తండ్రికి తెలిసి కన్నీరుమున్నీరయ్యాడు. పాపను కడసారి చూపు చూడాలని తపించాడు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమే లాక్‌డౌన్‌లో ఉంది. దీంతో విమానాల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పాప జ్ఞాపకాలు అనుక్షణం గుర్తుకొస్తూ…ఎలాగైనా చూడాలనే తండ్రి ఆకాంక్షకు కరోనా సైంధవుడిలా అడ్డు తగిలింది.
దీంతో చేసేదేమీ లేక నిస్సహాయుడయ్యాడు. ఇక తండ్రి వచ్చే పరిస్థితి లేకపోవడంతో పాప అంత్యక్రియలను తల్లి నేతృత్వంలో తప్పని సరిగా చేయాల్సి వచ్చింది. పాప అంతిమ సంస్కార యాత్రను వాట్సప్ కాల్‌లో తండ్రి చూస్తూ తల్లడిల్లాడు. తన కూతురు అందనంత సుదూరాలకు వెళ్లిపోయిందని, ఆ పాప తాలూకూ జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయని భాస్కర్ సరిపెట్టుకున్నాడు. ఈ పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదని స్థానికులు ఆవేదన చెందారు.