ఢిల్లీ మర్కజ్ ప్రభావం నిజామాబాద్ పై గట్టిగా పడింది. ఇప్పుడా నగరం కరోనా ధాటికి బిక్కుబిక్కుమంటోంది. దీనికి 2 కారణాలు. వీటిలో ఒకటి.. నిన్న ఒక్క రోజే నిజామాబాద్ లో 16 కరోనా కేసులు బయటపడడం. ఇక రెండో కారణం.. ఢిల్లీ మర్కజ్ కు వెళ్లొచ్చిన వాళ్లలో 15 మంది ఆచూకి తెలియకపోవడం. ఈ రెండు కారణాలతో ఇప్పుడు నిజామాబాద్ అట్టుడికిపోతోంది.
ఢిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన తబ్లిగీ జమాత్ మర్కజ్ కు నిజామాబాద్ నుంచి 57 మంది వెళ్లినట్టు ప్రభుత్వం గుర్తించింది. వీళ్లలో 42 మందిని క్వారంటైన్ కు తరలించింది. మిగతా 15 మంది ఆచూకి మాత్రం తెలియడం లేదు. వీళ్లు ఎక్కడున్నారు.. అసలు నిజామాబాద్ లోనే ఉన్నారా లేక అక్కడ్నుంచి మరో ప్రాంతానికి వెళ్లారా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రాధమిక సమాచారం ప్రకారం వీళ్లు ఢిల్లీ నుంచి నేరుగా నిజామాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. తర్వాత వీరి ఆచూకి గల్లంతైంది.
మరోవైపు నగరంలో ఇంటింటి సర్వే చేయడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది. పాజిటివ్ కేసులు పెరిగిన నేపథ్యంలో ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో జనాభా అధికంగా ఉన్న ఆటోనగర్, ఎన్ఆర్ఐకాలనీ, మాలపల్లి, ఖిల్లా ప్రాంతాల్లో సర్వే చేస్తున్న అధికారులకు స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. వివరాలు ఇచ్చేందుకు, సర్వేయర్లకు సహకరించేందుకు చాలామంది నిరాకరించారు. అయినప్పటికీ దాదాపు 80శాతం సర్వే పూర్తిచేశారు.
ప్రస్తుతం నిజామాబాద్ లో 3 క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటుచేసి 174 మందిని ఐసోలేషన్ లో ఉంచారు. వీళ్లందరి శాంపిల్స్ ను కరోనా టెస్టులకు పంపించారు. ఆచూకి దొరకని 15మందిని మరో 24 గంటల్లో కనిబెట్టాల్సిందిగా పోలీసులకు డెడ్ లైన్ విధించింది ప్రభుత్వం. దీంతో పాటు నగరంలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని సూచించింది. ప్రస్తుతం నిజామాబాద్ నిర్మానుష్యమైంది.