మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అక్కడితో ఆ సమస్య అయిపోయిందని అనుకుంది. హైకోర్టులో ఉన్న పిటిషన్లను కూడా కొట్టివేయాలని అభ్యర్థించింది. అయితే రైతులు, ఇతర పిటిషనర్లు మాత్రం మూడు రాజధానుల బిల్లు రద్దుతో ఈ సమస్య తీరిపోలేదని, అమరావతిలో అభివృద్ధి కుంటుపడిందని వాదించారు. చివరకు ఈ వాదనలపై ఏపీ హైకోర్టు తుది తీర్పునిచ్చింది. సహజంగానే ఇది ప్రభుత్వానికి మరో మొట్టికాయలా మారింది.
మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాల్సిందే..
గతంలో సీఆర్డీఏ చట్టం తయారు చేసే సమయంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ని ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఆరు నెలల్లోగా మాస్టర్ ప్లాన్ అమలు పూర్తి కావాలని చెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రసాంత్ కుమార్ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.
భూముల తనఖాపై ఆంక్షలు..
రాజధాని ప్రాంతం కోసం రైతుల వద్ద తీసుకున్న భూములను వేరే అవసరాల కోసం తాకట్టు పెట్టేందుకు ప్రభుత్వానికి అనుమతి లేదని కోర్టు చెప్పింది. భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లోగా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగించాలంది.
ఆరు నెలల్లోగా అక్కడ అందరికీ మౌలిక వసతులు కల్పించాలంది. అదే సమయంలో ఆ ప్రాంతంలోని భూములను ఇతర అవసరాల కోసం ప్రభుత్వం తనఖా పెట్టేందుకు వీలు లేదని స్పష్టం చేసింది.
కార్యాలయాల తరలింపుకి ఆటంకం..
పేరుకి మూడు రాజధానులు లేకపోయినా, రాజధాని ప్రాంతంలో ఉండాల్సిన కార్యాలయాలను తరలించేందుకు గతంలో ప్రభుత్వం ముందడుగు వేసింది. దీనికి కూడా ఇప్పుడు అడ్డుకట్ట పడినట్టయింది. అమరావతి నుంచి ఏ కార్యాలయాన్ని కూడా తరలించొద్దని హైకోర్టు ఆదేశించింది.
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని స్పష్టం చేసింది. సీఆర్డీఏ చట్టం రద్దు కుదరదని, దాని ప్రకారమే అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ఆరు నెలల్లోగా మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని తీర్పునిచ్చింది హైకోర్టు.