ప్రభుత్వం పేదల కోసం ఇల్లు కట్టిస్తుంది. ఇంటి నిర్మాణం కూడా పూర్తవుతుంది. కట్టడం పూర్తి చేసి ఏడాది గడుస్తున్నా, లబ్ధిదారుడి దానిని అందించకపోతే.. ఆ ఇంట్లో నివసించే అవకాశం కల్పించకపోతే ఎలా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం మీద కృతజ్ఞతతోనే, మా ఇంటి కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్న వారు.. కళ్లముందే ఇల్లు పూర్తయినప్పటికీ అందులో ప్రవేశించే భాగ్యం కనిపించక ఎంతకాలం కుములుతూ ఉండాలి.
అందుకే తెలంగాణ ప్రజలు ఒక చైతన్యవంతమైన నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణం పూర్తి కేటాయింపులు జరగక.. దిష్టిబొమ్మల్లాగా ఉంటున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలను పగులగొట్టి అందులో నివాసాలు ప్రారంభించారు. వారిని ఖాళీ చేయించడం అటు రెవెన్యూ పోలీసు అధికారులకు తలకు మించిన పని అవుతుంది.
ఈ చైతన్యం చాలా అభినందించదగినది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రకటించింది. నిజానికి ఈ ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా చాలా ఉంది. కేంద్రం నుంచి వచ్చే నిధులకు అదనంగా కొంత సొమ్ము తాము జోడించి, పూర్తిగా ఇది రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రచారం చేసుకుంటున్నారు.
ఇలాంటి వ్యవహారం ప్రతి చోట జరుగుతూనే ఉంటుందిగానీ.. నిర్వహణలో లోపాలు, పూర్తయిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందించలేని వైఫల్యాలు కలిసి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజల ఎదుట దోషిగా నిలబెడుతున్నాయి. కేసీఆర్ ఈ పథకం గురించి అప్పట్లో చాలా ఘనంగానే ప్రకటించారు. చాలా ఘనంగా ఆ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఇళ్ల నిర్మాణం పూర్తయి, ఎక్కడైతే లబ్ధిదారులకు వాటిని అప్పగించారు ఆయా చోట్ల చాలా ఆర్భాటంగా వేడుకలు నిర్వహించారు. కానీ పూర్తయిన ఇళ్లలో లబ్ధిదారులకు అప్పగించినది కేవలం ఆరు శాతం మాత్రమే అనే వాస్తవం తెలిస్తే ఆశ్చర్యపోతాం.
అధికారిక గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి 2.91 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. 1.82 లక్షల ఇళ్లు దాదాపుగా పూర్తయినట్టే. కానీ ఇప్పటి దాకా 17 వేల ఇళ్లను మాత్రమే ప్రజలకు అప్పగించడం జరిగింది. నిధులు కేంద్రం ఉన్నది గనుక ఎవరికి అప్పగించారో ఆ జాబితా ఇవ్వాలని కేంద్రం సహజంగానే అడుగుతోంది. కానీ వారికి ఇవ్వడానికి తెలంగాణ సర్కారు వద్ద లబ్ధిదారుల జాబితా సిద్ధంగా లేదు. కేవలం చాలా పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారుల జాబితాలు మాత్రమే ఉన్నాయి.
సుమారు రెండు లక్షల ఇళ్లను కట్టడం పూర్తి చేశారు గాని.. వాటిని ఎవరికి ఇవ్వాలో జాబితాలను వడపోసి పేదలను ఎంపిక చేయడం ప్రభుత్వానికి ఇప్పటిదాకా కుదిరినట్టు లేదు. ఇలాంటి సందర్భాలలోనే.. ప్రభుత్వం చిత్తశుద్ధి మీద అనుమానం కలుగుతుంది.
లబ్ధిదారుల ఎంపికలో సొంత మనుషులకు పెద్దపీట వేయాలని కుట్రకు వ్యూహరచన సాగుతున్నట్లుగా అనుమానం కలుగుతుంది. టు బెడ్ రూమ్ ఇల్లు వస్తాయని ఆశగా ఎదురు చూసిన లబ్ధిదారులు విసిగిపోతున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాలలో వారు పూర్తయిన ఇళ్లకు వేసిన తాళాలను పగులగొట్టి స్వాధీనం చేసుకుంటున్నారు.
లబ్ధిదారుల ఎంపిక స్వార్ధానికి, కార్యకర్తలకు కట్టబెట్టాలని వ్యూహానికి పెద్దపీట వేయకపోతే ప్రభుత్వం ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నట్టు? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏ ఊరిలో ఏ సమావేశం పెట్టినా సరే.. టు బెడ్ రూమ్ ఇళ్ల గురించి చాలా గొప్పగా టముకు వేసుకుంటూ ఉంటారు.
పేదల కోసం ప్రభుత్వ సంక్షేమ పథకం అంటే.. కేవలం దాని రూపకల్పన, ఇళ్ల నిర్మాణం రూపేణా కాంట్రాక్టు పనులు పూర్తి చేయడం.. సదరు కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించడం మాత్రమే కాదు కదా. వాటి ద్వారా ఏ పేదలకు మేలు జరగాలని ఆశించారో.. వారికి అవి అందాలి కదా? రాష్ట్ర ఆలోచన మాత్రం ప్రభుత్వానికి ఉండడం లేదు. అందుకే ప్రజలు తమంతట తాముగా.. ఒక తిరుగుబాటు తరహాలో స్వాధీనం చేసుకోవడం జరుగుతోంది.
ఆకలిగా ఉన్నవారిని గుంపులుగా పోగేసి, వారి ముందు పెద్ద పెద్ద పాత్రల్లో పంచభక్ష పరమాన్నాలు సిద్ధంగా ఉంది.. వడ్డించ కుండా కొన్ని గంటలు గడిపేస్తే ఏమవుతుంది. ఆకలిగొన్న ఎగబడి తినేయడం జరుగుతుంది. టూ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో ఇప్పుడు తెలంగాణాలో జరుగుతున్నది కూడా అదే. ప్రజల్లో చైతన్యం ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. గొప్ప పథకం గురించి గొప్పలు చెప్పుకోవడం మాత్రమే కాదు. ప్రజలకు వాటిని సకాలంలో అందించాలని, వారు తెలుసుకోవాలి!