అనుకున్నంతా జరిగింది. 5100 బస్సుల్ని ప్రైవేటుపరం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులు ఏమీ చేయలేవని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన వేళ.. కేబినెట్ నిర్ణయంపై హైకోర్టు కలుగజేసుకుంది. సోమవారం వరకు ప్రైవేటీకరణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
5100 రూట్లలో ప్రైవేట్ ట్రావెల్స్ కు పర్మిట్లు ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు సవాల్ చేశారు. అత్యవసర పరిస్థితి కింద తన పిటిషన్ ను విచారించాలని కోరారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు.. ప్రైవేటీకరణకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు అమలు చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు.. ఈ పిటిషన్ కు సంబంధించి సోమవారం లోగా కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది.
దీంతో మరోసారి ప్రభుత్వం వెర్సెస్ హైకోర్టు తకరారు మొదలైంది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులు కాదనకూడదనేది ప్రాధమిక సూత్రం. ప్రజాప్రతినిథులంతా కలిసి సమిష్టిగా ఓ నిర్ణయం తీసుకుంటే.. దాన్ని అడ్డుకునే హక్కు ఏ కోర్టుకు ఉండదనేది రాజ్యంగం. అయితే ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తే, వాళ్ల నిర్ణయాలపై ప్రశ్నించే హక్కు కోర్టులకు ఉంటుంది. ఇది కూడా రాజ్యంగా కల్పిస్తున్న హక్కు. దీంతో ఈ చిక్కుముడి ఎలా వీడుతుందనేది ప్రశ్నార్థకరంగా మారింది.
హైకోర్టు తాజా ఆదేశాన్ని కేసీఆర్ కు పెద్ద ఎదురుదెబ్బగా చెబుతున్నారు విశ్లేషకులు. ఇప్పటికే సగం ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేలా కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్న కేసీఆర్, రేపోమాపో మిగిలిన రూట్లలో కూడా ప్రైవేట్ కు పర్మిట్లు ఇచ్చేయాలని చూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైమ్ లో కేసీఆర్ తీసుకున్న మొదటి నిర్ణయానికే కోర్టు అడ్డుచెప్పింది. దీంతో ఆర్టీసీ కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆర్టీసీ సమ్మె, కార్మికుల జీతాల నిలుపుదలకు సంబంధించి ఇప్పటికే కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వాటికి అనుబంధంగా ఈ కేసును కూడా జతచేసింది హైకోర్టు. ఈ మొత్తం వ్యవహారంపై సోమవారం మరోసారి వాదనలు జరగనున్నాయి. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్, ఇప్పటివరకు కేటాయించిన నిధులు లాంటి అంశాల్ని పక్కనపెట్టి.. ప్రైవేటీకరణ, సమ్మెపై సోమవారం కోర్టు దృష్టిపెట్టే అవకాశం ఉంది.