తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తహశీల్దారు విజయారెడ్డి సజీవ దహనం కేసు కొత్త మలుపు తిరిగింది. విజయారెడ్డిపై పెట్రోల్ పోసి హత్య చేసిన సురేష్ మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడామె భార్య సంచలన వ్యాఖ్యలు చేసింది. విజయారెడ్డి లంచం అడగడం వల్లనే ఆమెను బెదిరించడం కోసం సురేష్ పెట్రోల్ తీసుకెళ్లాడని ఆరోపిస్తోందామె.
వాస్తవానికి విజయారెడ్డిని చంపాలనేది సురేష్ ఉద్దేశ్యం కాదంటోంది ఆమె భార్య. కేవలం భయపెట్టడానికి మాత్రమే పెట్రోల్ తీసుకెళ్లాడని, కానీ ఎమ్మార్వో ఆఫీస్ లో మాటమాట పెరగడంతో, ఆవేశంతో విజయారెడ్డిని సురేష్ చంపాల్సి వచ్చిందట. ఘటన జరిగిన రోజు హాస్పిటల్ లో చేరిన సురేష్, అదే రోజు తన చెవిలో ఈ మాటలు చెప్పాడని అంటోంది ఆమె భార్య.
అంతేకాదు.. విజయారెడ్డితో వరుసగా సమావేశమవుతున్న సురేష్, కొన్ని రోజుల కిందట 9 లక్షల రూపాయలు అప్పు చేశాడని, ఆ డబ్బును ఎవరికి ఇచ్చాడో తనకు తెలియదని అంటోంది సురేష్ భార్య. విజయారెడ్డికి లంచం ఇవ్వడం కోసమే సురేష్ ఆ డబ్బును అప్పుగా తీసుకున్నాడని ఆమె పరోక్షంగా చెబుతోంది.
విజయారెడ్డి లంచం అడిగిందనే విషయాన్ని సురేష్ తనకు చెప్పాడని, కాకపోతే అప్పుగా తీసుకున్న 9 లక్షలు ఎవరికి ఇచ్చాడో తనకు తెలియదని అంటోంది సురేష్ భార్య. సురేష్ భార్య లత వ్యాఖ్యలతో ఈ కేసు మరో కొత్త మలుపు తీసుకుంది. అయితే పోలీసులు మాత్రం సురేష్ భార్య మాటల్ని నమ్మడం లేదు. ప్రస్తుతం వాళ్లు.. ఘటన జరిగిన రోజు బయటకొచ్చిన సురేష్, ఎవరితో మాట్లాడాడనే విషయంపై మాత్రమే ఆరా తీస్తున్నారు. ఆరోజు కార్యాలయంలోకి వెళ్లే ముందు, కారులో ఉన్న కొంతమంది వ్యక్తులతో సురేష్ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.