రాజధాని అమరావతి నుంచి కర్నూలుకు హైకోర్టు తరలింపుపై బీజేపీ ఉత్సాహం కనబరుస్తోంది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాటల్లో ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అమరావతిలో మీడియాతో మాట్లాడిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ పలు అంశాలపై తనదైన శైలిలో మాట్లాడారు. ముఖ్యంగా ఆయన రాజధాని మార్పు, కర్నూలుకు హైకోర్టు తరలింపుపై కేంద్రం వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేసే అంశంపై కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ను కలుస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ తెలిపారు. రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని అందరికంటే ముందు హామీ ఇచ్చింది బీజేపీనే అని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పార్టీ మేనిఫెస్టోలోనూ చేర్చామని, రాష్ట్ర పార్టీలో తీర్మానం కూడా చేశామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. కానీ అమరావతిలోనే హైకోర్టు కొనసాగించాలని ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. సుజనా మాటలను జీవీఎల్ ఏ మాత్రం ఖాతరు చేయడం లేదని ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
అలాగే రాజధాని విషయమై కేంద్రప్రభుత్వ వైఖరిని మళ్లీమళ్లీ ఆయన స్పష్టం చేశారు. అమరావతిలోనే కొనసాగించే విషయంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటన్నది గత పార్లమెంట్ సమావేశాల్లో గుంటూరు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం చెప్పిందన్నారు. దీనిపై ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేయవద్దని ఆయన టీడీపీ నేతలకు హితవు పలికారు.
ఎలాగైనా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ కంటే, బీజేపీలోని జీవీఎల్ వర్గానికి ఎక్కువగా ఉంది. తద్వారా టీడీపీతో పాటు ఆ పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులకు చెక్ పెట్టాలనేది జీవీఎల్ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే ఆయన హైకోర్టు మార్పుపై చొరవ తీసుకుంటున్నారు. సంబంధిత కేంద్రమంత్రిని కలుస్తామని కూడా చెబుతున్నారు. జీవీఎల్ చొరవతో జగన్ పని సులవవుతుందని చెప్పక తప్పదు.