బాలీవుడ్ లో సందేశాత్మక సినిమాల్లో నటించేస్తూ ఉంది తాప్సీ. అది కూడా వర్తమాన సినిమాల్లో చూపించేందుకు భిన్నమైన అంశాలను ఆ సినిమాల్లో చూపిస్తూ ఉన్నారు. అలాంటి వాటిల్లో ఒకటిగా నిలిచింది తాజా సినిమా 'తప్పడ్'. కబీర్ సింగ్ సినిమాలో హీరోయిన్ ను హీరో చెంపదెబ్బ కొట్టడానికి ఈ సినిమా కౌంటర్ అంటూ ప్రచారం వచ్చింది. అయితే ఆ ప్రచారాన్ని తాప్సీనే ఖండించింది. కబీర్ సింగ్ విడుదల అయ్యే నాటికే తమ సినిమా కథ రెడీ అయిపోయిందని చెప్పింది. ఏతావాతా డొమెస్టిక్ వమొలెన్స్ మీద ఈ సినిమాను రూపొందించినట్టుగా ఏదో చెప్పారు.
ఇక ఈ సినిమాకు బాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు దండిగా లభించాయి. అనేక మంది హిందీ చిత్ర పరిశ్రమ ముఖ్యులు ఈ సినిమాను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అభినందించారు. సినిమా సూపరన్నారు. తాప్సీ అలా ప్రశంసల వర్షంలో తడుస్తూ ఉంది. ఇక సినిమాకు సానుకూల రివ్యూలు కూడా వచ్చాయి! అయితే ఇదేదో సందేశం బాపతులా ఉందని ప్రేక్షకులు భావించినట్టుగా ఉన్నారు. అందుకే తొలి రోజు తాప్సీ సినిమాకు కలెక్షన్లు డల్ గా ఉన్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఫస్ట్ డే ఈ సినిమా మూడు కోట్ల రూపాయల వసూళ్లను సాధించిందట. ఇది తక్కువ మొత్తమే అని ట్రేడ్ వర్గాలే అంటున్నాయి. అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందని, మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఏదేమైనా సినిమాకు మల్టీ ప్లెక్స్ ఆడియన్సే ఆధారం. అదే సమయంలో వీరు అతిగా సందేశాలు ఇచ్చి ఉంటే మాత్రం సగటు ప్రేక్షకుడు విసిగిపోయే అవకాశాలు లేకపోలేదు.