రాజధాని ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తిచేయాలని భావిస్తోంది జగన్ సర్కార్. అందుకు తగ్గట్టుగానే వడివడిగా అడుగులు వేస్తోంది. సీఎం సమక్షంలో మరికాసేపట్లో హై-పవర్ కమిటీ భేటీ కానుంది. కమిటీకి సంబంధించి ఇదే ఆఖరి భేటీ. ముఖ్యమంత్రి సమక్షంలో ఈరోజే కీలక నిర్ణయాలన్నీ తీసుకుంటారు. తుది నివేదికను 20న అసెంబ్లీ సమావేశాల రోజున లేదా అంతకంటే ఒక రోజు ముందు ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది.
విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటుచేసే అంశంతో పాటు ఉద్యోగుల తరలింపుపై కూడా ఇవాళ్టి మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అలాగే సీఆర్డీఏను రద్దు చేయడంతో పాటు అమరావతి రైతులకు ఎలాంటి ప్యాకేజీ ఇవ్వాలి, వాళ్లను ఎలా ఆదుకోవాలనే అంశంపై కూడా భేటీలో చర్చిస్తారు. మరీ ముఖ్యంగా అమరావతి భూముల్ని ఏం చేస్తారనే అంశంపై కూడా కీలక చర్చ జరగనుంది. అమరావతి భూములతో ఎగ్రికల్చర్ జోన్ (గ్రీన్ కారిడార్) ఏర్పాటుచేసే అంశంపై ప్రభుత్వం సీరియస్ గా చర్చిస్తోంది.
హై-పవర్ కమిటీ ఇప్పటికే 3సార్లు భేటీ అయింది. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ ఇచ్చిన నివేదికలపై కూలంకుషంగా చర్చించింది. ఆ వివరాల్ని ఈరోజు ముఖ్యమంత్రికి వివరిస్తుంది 16 మంది సభ్యులతో కూడిన కమిటీ. అమరావతి డెవలప్ మెంట్ బోర్డు ఏర్పాటుతో పాటు గత ప్రభుత్వం చెప్పినట్టుగానే అమరావతి రైతులకు ప్లాట్లు కేటాయించే అంశంపై ఈరోజు చర్చిస్తారు. ప్లాట్లు వద్దనుకునే రైతులకు తిరిగి వాళ్ల భూమిని ఎలా అప్పగించాలనే అంశంపై కూడా ఈరోజు చర్చిస్తారు.
ఈనెల 20 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే ఏపీ రాజధాని అంశంపై జగన్ సర్కార్ కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.