మొన్నటివరకు ఏదో మూల ఆశ. పవన్ మళ్లీ వస్తాడని, టీడీపీకి కళ తెస్తాడని. అలా మిణుకుమిణుకుమంటున్న ఆశను కూడా చంపేశాడు పవన్. వెన్నుపోటు పొడవకుండా చంద్రబాబును కుప్పకూల్చాడు. భవిష్యత్తులో టీడీపీతో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టంచేశారు పవన్. వైసీపీ, టీడీపీని ఓడించడమే లక్ష్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు పనిచేస్తామని కుండబద్దలుకొట్టారు. బాబు కల చెదిరింది.
గత ఎన్నికల్లో తమతో విభేధించినా ఎప్పటికైనా తమ గూటికే పవన్ వస్తాడని బాబు వేయికళ్లతో ఎదురుచూశారు. వైసీపీ నేతలంతా పవన్ ను బాబుకు దత్తపుత్రుడుగా విమర్శిస్తుంటే.. పైకి బాధ నటించినా లోలోపల ఉప్పొంగిపోయారు. పవన్ ను టీడీపీకి భవిష్యత్ ఆశాదీపంగా చూశారు. కానీ ఇప్పుడు ఆ దీపం ఆరిపోయింది. బాబు కల చెదిరింది.
ఎదిగిన కొడుకు చేతికందివస్తాడని ఎదురుచూశారు. కానీ లోకేష్ మాత్రం “మందళగిరి” దగ్గరే ఆగిపోయారు. చివరికి అమరావతి పెయిడ్ ఉద్యమాన్ని కూడా ఓన్ చేసుకోలేక, నాలుగు గోడల మధ్య ట్వీట్లు చేసుకుంటూ గడిపేస్తున్నారు. బాబు చేసుకున్న స్వయంకృతాపరాధం వల్ల టీడీపీలో నంబర్-2 లేకుండా పోయింది. ఇలాంటి టైమ్ లో పవన్ తో కలిసి రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించాలని అనుకున్నారు బాబు. చినబాబు చేతికందకపోయినా, పవన్ అండతో పాలిటిక్స్ చేద్దామనుకున్నారు. కానీ బాబు కల చెదిరింది.
అయితే ఇప్పటికీ బాబు మనసులో ఏదో ఒక మూల చిన్న ఆశ కొట్టుమిట్టాడుతూనే ఉంది. ఎందుకంటే బీజేపీ తనకు శత్రువైనా, పాత మిత్రువే కదా. పైగా తన పార్టీకి చెందిన ఎంపీలంతా అక్కడే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కాకపోయినా ఎన్నికల టైమ్ కైనా బీజేపీ తోక పట్టుకొని ఎన్నికల గోదారి ఈదేద్దామనేది బాబు మనసులో ఆలోచన. కానీ ఆ కల కూడా చెదిరింది.
బాబు ఆలోచనలను చిదిమేశారు పవన్ కల్యాణ్. భవిష్యత్తులో బాబుతో పొత్తు ఉండకూడదనే కండిషన్ మీదే ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపారు. నిన్నటి భేటీలో బీజేపీ నేతలు ఈ దిశగా స్పష్టమైన ప్రకటన చేశారు. టీడీపీతో పొత్తు ఉండదని పదేపదే చెప్పడం చూస్తుంటే.. బీజేపీకి బాబు పొడిచిన వెన్నుపోటు ఎంత లోతుగా దిగిందో అర్థమౌతూనే ఉంది. సో.. పవన్ ఆ గట్టుకు చేరడంతో బాబు కల శాశ్వతంగా చెదిరిపోయింది.