రాజధాని అంశంపై ఏర్పాటైన హై-పవర్ కమిటీ ఈరోజు భేటీ అయింది. విజయవాడలోని ఆర్టీసీ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నేతృత్వం వహించారు. మంత్రులు బొత్స, బుగ్గన, సుచరిత, కొడాలి నాని, సురేష్ తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. కమిటీలో ఉన్న ఇతర అధికారులు కూడా హాజరయ్యారు. తొలి రోజు సమావేశంలో సభ్యులంతా పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై ఓ అవగాహనకు వచ్చారు.
ఈ విషయంలో ఎలాంటి అభిప్రాయబేధాల్లేకుండా, సభ్యులంతా పరిపాలన వికేంద్రీకరణకు కట్టుబడి ఉండాలని తీర్మానించుకున్నారు. ఆ తర్వాతే నివేదికలపై చర్చకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇలా తీర్మానించుకున్న తర్వాత జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ ఇచ్చిన నివేదికలకు సంబంధించిన ముఖ్యాంశాలపై చర్చించారు. అయితే తొలి రోజు కావడంతో ఏ ఒక్క అంశంపై లోతుగా చర్చించలేదు.
తుది నివేదిక సమర్పించడానికి 20వ తేదీ వరకు సమయం ఉండడంతో.. ఒక్కో అంశంపై సుదీర్ఘంగా, లోతుగా చర్చించాలని కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏఏ అంశాల్ని ఏ రోజుల్లో చర్చించాలి, ఎంత సమయం కేటాయించాలనే విధివిధానాలపై ఈరోజు ఓ నిర్ణయం తీసుకున్నారు.
కేవలం 3 రాజధానుల అంశానికి మాత్రమే హై-పవర్ కమిటీ పరిమితం కాదు. రాష్ట్రంలో ఏ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుందనే అంశంపై కూడా కమిటీలు ఇచ్చిన సూచనల్ని అధ్యయనం చేస్తుంది. అలా 16 మంది సభ్యులతో కూడిన తుది కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేబినెట్ మీటింగ్ లో చర్చిస్తారు. కేబినెట్ చర్చ అనంతరం కీలక నిర్ణయాల్ని ప్రకటిస్తారు.