‘కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేసి రైతులకు అండగా నిలబడాలని… సీఎం జగన్ ఎందుకు దిగిరారో చూద్దాం’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 24 గంటల దీక్షను లోకేశ్ మంగళవారం విరమింపజేశారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ విశాఖ వాసులు ఏనాడూ తమ ప్రాంతానికి రాజధాని కావాలని అడగలేదన్నారు. ‘అమరావతి శంకుస్థాపనకు జగన్ రాలేదు. రాజకీయ లబ్ధి కోసం ప్రాంతాల మధ్య జగన్ చిచ్చు పెడుతున్నాడు’ అని లోకేశ్ అన్నారు.
రాజధాని శంకుస్థాపనకే రాని నాయకుడు, ఆ ప్రాంతంపై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నాడో తెలుసుకోలేని అజ్ఞానంలో లోకేశ్ ఉన్నారా? అలాగే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేవారికి రాజకీయ లబ్ధి ఎలా చేకూరుతుందో లోకేశ్ చెప్పగలరా? అమరావతి అందరి రాజధాని అయినప్పుడు ఒక ప్రాంతం వాళ్లలో సంతోషం, ఇతర ప్రాంతాల్లో ఆగ్రహం ఎందుకు ఉంటుందో లోకేశ్ జవాబు చెబుతారా?
అలాగే గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజాప్రతినిధుల రాజీనామాలతో జగన్‌ను తన నిర్ణయం నుంచి దిగి వచ్చేలా చేయ వచ్చంటున్న లోకేశ్…ముందు తాను ఏనాడైనా ప్రజల్లో ఉన్నారా? ఎంత సేపూ ట్విటర్ తప్ప మరే లోకం గురించి తెలుసుకోకుండా లోకేశ్ రాజకీయాలు చేయడం లేదా? ట్విటరే ప్రపంచంగా బతుకుతున్న లోకేశ్‌ను ప్రజలు ‘మంగళగిరి’ మాన్యాలు పట్టించలేదా? కనీసం ఓడిన తర్వాతైనా ట్విటర్ దిగని లోకేశ్….సీఎం జగన్‌ను కిందికి దించుతాననడం ఏంటో? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.