కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో కేసీఆర్ సర్కార్‌పై హైకోర్టు తీవ్ర ఘాటు వ్యాఖ్యల పరంపర కొనసాగుతోంది. కరోనా నిర్ధారణ పరీక్షలు, ప్రజలకు సమాచారం చేరవేత విషయంలో కేసీఆర్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని ఇటీవల హైకోర్టు మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే.
తాజాగా తెలంగాణ కరోనా పరిస్థితులపై సోమవారం హైకోర్టులో విచారణ సాగింది. కరోనాపై తాము పదేపదే ఆదేశిస్తున్నా ఒక్కటి కూడా అమలు కావడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన కూడా వచ్చింది. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పోల్చితే కరోనా పరీక్షల్లో తెలంగాణ చాలా వెనుకబడి ఉందని హైకోర్టు పేర్కొంది. తెలంగాణలో కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, ప్రజలను గాలికి వదిలేసిందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.
కరోనా బులిటెన్, రోగుల బెడ్ల వివరాలపై అధికారులు కావాలనే వాస్తవాలను దాచిపెట్టి కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడింది. కరోనా విషయంలో హైకోర్టు అభినందించిందని బులిటెన్‌లో పేర్కొనడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఆగ్రహించింది. తాము మొట్టి కాయలు వేస్తుంటే అభినందించినట్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా అని ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది. కరోనా విషయంలో ఈ స్థాయిలో బహుశా ఏ రాష్ట్రాన్ని కూడా న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడి ఉండదేమో! ప్రతిపక్షాల నోరు మూయించిన కేసీఆర్ సర్కార్…. హైకోర్టు రూపంలో ఎదురవుతున్న ప్రశ్నలు, నిలదీతలకు ఉక్కిరిబిక్కిరి అవుతోంది.