బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నోటికి పని చెప్పింది. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తిట్ల వర్షం కురిపించారు. దీంతో బాలీవుడ్లో సరికొత్త సినిమా ఆవిష్కృతమవుతోంది. బాలీవుడ్లో నెపోటిజంపై చెలరేగిన వివాదం ఇప్పట్లో ముగిసిపో యేలా లేదు. విమర్శలు, ప్రతివిమర్శలతో రోజురోజుకూ బాలీవుడ్ హీటెక్కుతోంది.
కంగనా తాజా ఇంటర్వ్యూలో పలువురిని టార్గెట్ చేశారు. తీవ్ర పదజాలంతో కామెంట్ చేశారు. తాప్సీ, స్వర భాస్కర్ వంటి హీరోయిన్లను బీగ్రేడ్ ఆర్టిస్ట్‌లు అనడం, ఆ వ్యాఖ్యలపై తాప్సీ నర్మగర్భ విమర్శలు చేయడం తెలిసిందే. అలాగే అలియా భట్‌కు సిగ్గులేదంటూ కంగనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో బాలీవుడ్లో కలకలం రేపింది. ఇంతకూ కంగనా ఏమన్నారంటే…
“ప్రతిభతో సంబంధం లేకుండానే బాలీవుడ్లో అవార్డులకు నామినేషన్లు, ఎంపిక జరుగుతాయి. హ్యాపీ న్యూ ఇయర్ సినిమాకు దీపిక పదుకొణేకు అవార్డు వచ్చింది. అయితే తనకన్నా క్వీన్ సినిమాలో నటన బాగుందన్న విషయాన్ని ఆమె అంగీకరించి అవార్డు తిరస్కరించింది. ఇలా చేయాలంటే ఎంతో సంస్కారం కావాలి. కానీ “గల్లీబాయ్”లో 10 నిమిషాలు కనిపించిన అలియాభట్ మాత్రం కొంచెం కూడా సిగ్గు లేకుండా అవార్డు అందుకుంది, సుశాంత్ సింగ్ “చిచోర్” సినిమాకు మాత్రం కనీస ప్రశంసలు దక్కలేదు” అని ఆమె ఫైర్ అయ్యారు.
ఇంకా ఈ ఇంటర్వ్యూలో ఆమె తన మాటలకు మరింత పదును పెట్టారు. ఉద్యమకారిణి అవతారం ఎత్తినట్టు మాట్లాడారు.
“సుశాంత్‌ను ఎదగనీయకుండా బాలీవుడ్ మాఫియా అణగదొక్కింది. “డ్రైవ్” చిత్రం సుశాంత్ కెరీర్‌ను సర్వ నాశనం చేసింది. ఆ సినిమాను థియేటర్లో విడుదల చేసే సామర్థ్యం నిర్మాత కరణ్ జోహార్‌కు లేదంటే నేను ఎప్పటికీ నమ్మను. నిజానికి మహేశ్ భట్, కరణ్ జోహార్లపై కేసు పెట్టినా తప్పు లేదు. ఇది ఒక్క నా పోరాటమే కాదు. గొంతు ఉందని మర్చిపోయిన సమాజం కోసం నేను పోరాడుతున్నాను. జీవితంలో వెనక్కు తిరిగి చూసుకుంటే నేను చేయాలనుకుంది చేశాను అన్న తృప్తి ఉంటే చాలు” అని కంగనా చెప్పుకొచ్చారు. బాలీవుడ్లో నెపోటిజమ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కంగనా విమర్శలపై ప్రత్యర్థులు ఎలా స్పందిస్తారో చూడాలి.