విద్య, వైద్యం చాలా ఇంపార్టెంట్. నిజానికి మానవ జీవిత వికాసానికి ఈ రెండూ చాలా కీలకమైన భూమిక పోషిస్తాయి. ఇపుడు ప్రపంచమంతా ఆరోగ్యం కోసం అర్రులు చాస్తోంది. కరోనా వేళ అది ఇంకా బాగా తెలిసివచ్చింది కూడా.
ఈ నేపధ్యంలో అతి ముఖ్యమైన వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఉత్తరాంధ్రాకు చెందిన వారికి అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. ఈ నెల 22న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్న నేపధ్యంలో శ్రీకాకుళం పలాసా ఎమ్మెల్యే, డాక్టర్ కూడా అయిన సీదరి అప్పలరాజుకి సీఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినట్లుగా చెబుతున్నారు.
ఆయనకు మంత్రి పదవి ఖాయమని కూడా అంటున్నారు. అంతే కాదు, కీలకమైన వైద్య శాఖను ఇచ్చి డాక్టర్ మంత్రిని చేస్తారని చెబుతున్నారు. దీంతో శ్రీకాకుళం జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కుతాయని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మాత్రం ఆ డాక్టర్ ఎమ్మెల్యే అమాత్య కుర్చీలో కుదురుకుపోవడం ఖాయమని అంటున్నారు.