పాజిటివ్…కరోనా మహమ్మారి పుణ్యమా అని ఈ పదం ఇప్పుడు భయపెడుతోంది. కరోనాకు ముందు పాజిటివ్ గురించి వ్యక్తిత్వ వికాస నిపుణులు ఎంతో గొప్పగా చెప్పేవాళ్లు. పాజిటివ్ దృక్పథంతో ఏదైనా సాధించవచ్చని, అందువల్ల ప్రతి మనిషి ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించాలని పదేపదే నూరిపోసే వాళ్లు. మనసులోకి ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలు తీసుకోవద్దని హెచ్చరిం చేవాళ్లు. ఇప్పుడు అంతా తలకిందులైంది. దీనికి కారణం కరోనా మహమ్మారి.
ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కరోనాబారిన పడి సురక్షితంగా బయటపడ్డాడు. 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండి, బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేకుండా కరోనాపై ఒంటరి పోరు సాగించి విజేతగా నిలిచాడు. కరోనా తనలో ఎంతో మార్పు తీసుకొచ్చిందని ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆయన మాట్లాడే ప్రతిమాట ఎంతో పాజిటివ్‌గా ఉంటోంది. ఆయన్ను టచ్ చేస్తే చాలు…అణువణువు పాజిటివ్ పాజిటివ్ అని మార్మోగుతోంది. ఆయనలో కరోనా తీసుకొచ్చిన పాజిటివ్ దృక్పథం గురించి తెలుసుకొందాం.
కరోనా పాజిటివ్ అని తెలియగానే క్షణ కాలం పాటు ఏమీ అర్ధం కాలేదని గణేష్ తెలిపాడు. మొదట భయం కలిగిందన్నాడు. ఆ సమయంలో తనకు దేవుడు గుర్తుకొచ్చినట్టు తెలిపాడు. తనను కరోనా నుంచి బయటపడేయాలని భగవంతున్ని ప్రార్థించినట్టు చెప్పుకొచ్చాడు.
వెంటనే ఇంటిపై గదిలో హోంక్వారంటైన్‌కు వెళ్లినట్టు తెలిపాడు. వైద్యుల సలహా ప్రకారం మందులు వాడినట్టు చెప్పాడు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గుడ్డు తినేవాడినన్నాడు. అలాగే వేడినీటిని పుక్కిలించడం, ఆవిరి పట్టుకోవడం లాంటి ఇంటింటి చిట్కాలను పాటించినట్టు తెలిపాడు. అలాగే శ్వాసకు సంబంధించి వ్యాయామాలు, విటమిన్ మందులు వేసుకున్నట్టు తెలిపాడు. ఈ విధంగా తాను గది నుంచి రెండువారాల పాటు గదికే పరిమితమై కరోనాపై పైచేయి సాధించినట్టు బండ్ల గణేష్ వినమ్రంగా చెప్పుకొచ్చాడు.
కరోనా తనలో ఎంతో పాజిటివ్ దృక్పథాన్ని తీసుకొచ్చినట్టు బండ్ల గణేష్ తెలిపాడు. మనిషి దేనికీ అతీతం కాదనే సత్యాన్ని తెలుసుకున్నానన్నాడు. బతికినంత కాలం ఎలాంటి గొడవలు, వివాదాలు లేకుండా జీవించాలనే నియమాన్ని పెట్టుకున్నా నన్నాడు. అలాగే ఎంత కాలం బతికామన్నది ముఖ్యం కాదని, ఎంత మంచిగా బతికామన్నదే ప్రధానమని తెలుసుకున్నట్టు గణేష్ పేర్కొన్నాడు. ఎందుకంటే ఆ మంచితనమే శాశ్వతమన్నాడు.
కరోనా నియంత్రణలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చాడు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పకడ్బందీ వ్యూహాలతో ముందుకు పోతున్నాయన్నాడు. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాల విమర్శలు సరి కాదన్నాడు. అందరూ ఐక్యంగా పోరాడితే మహమ్మారిని అంతం చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు.
కరోనా నుంచి సురక్షితంగా బయటపడిన తాను ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు గణేష్ ప్రకటించాడు. తన వల్ల మరొకరు బతుకుతారంటే అంతకంటే కావాల్సింది ఏముందని ఆయన సంతోషం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా కరోనా బారిన పడ్డవాళ్లు ధైర్యంగా ఉండాలన్నాడు. అదే సగం మందు అని తెలిపాడు. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించాడు. వీటన్నింటి కంటే కరోనాకు దూరంగా జీవించడమే ఉత్తమమన్నాడు.
ఇక సినిమా విషయానికి వస్తూ…ఆ రంగానికి మళ్లీ పూర్వపు వైభవం వస్తుందని ఆశా భావం వ్యక్తం చేశాడు. కరోనాకు ముందు బండ్ల గణేష్ కొందరిపై విపరీతంగా ప్రేమ కనబరచడం, మరికొందరిపై నోరు పారేసుకోవడాన్ని చూశాం. అలాగే నోటికి ఎంత మాటొస్తే అంత మాట మాట్లాడేవాడనే పేరు ఉండేది. కరోనా నుంచి బయట పడిన తర్వాత ఆయనలో ఎంతో పాజిటివ్ దృక్పథం కనిపించడం ప్రతి ఒక్కర్నీ ఆశ్చర్యపరుస్తోంది.