మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్… అత్యంత పలుకుబడి కలిగిన న్యాయవాది. ఈయన గురించి జగన్ సర్కార్ తక్కువ అంచనా వేసి, అనసవరంగా తలనొప్పి తెచ్చుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దమ్మాలపాటి అంటే ఆయన మాత్రమే కాదు. అనేక శక్తులు, యుక్తులు, వ్యవస్థలు కలిస్తే దమ్మాలపాటి. అది ఆయన పవర్. బహుశా ఆయన ఎంత శక్తిమంతుడో ఇవాళ మరోసారి జగన్ సర్కార్‌కు తెలిసొచ్చి వుంటుంది.
మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, మరికొందరిపై..ఇన్‌సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం కింద జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులను గురువారం హైకోర్టు కొట్టేసింది. దమ్మాలపాటిపై అవినీతి చట్టంకింద ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేయడం, గతంలో హైకోర్టు స్టే ఇచ్చిన సంగతులన్నీ తెలిసినవే. హైకోర్టు ఆ మధ్య గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం, దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఉదంతంలో ఈయనతో మరికొందరు కీలకం.
హైకోర్టులో సానుకూల ఫలితం రాకపోవడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదని, హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించిన సంగతి తెలిసిందే. ఈ కేసును నెల రోజుల్లో విచారించాలని ఏపీ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో పిటిషన్‌ను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
ఈ కేసుకు సంబంధించి హైకోర్టు నెలరోజుల పాటు విచారించింది. వాదప్రతివాదనలు విన్నది. జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ బెంచ్ గురువారం తుది తీర్పు వెలువరించింది. దమ్మాలపాటితో పాటు ఆయన బంధువులు, కుటుంబీకులెవరూ ప్రభుత్వం చెబుతున్నట్టు అవినీతికి పాల్పడలేదని తేల్చి చెప్పింది. వారిపై ప్రభుత్వ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, రుజువులు లేవని న్యాయస్థానం పేర్కొంటూ కేసులను కొట్టేసింది.
ఈ సందర్భంగా హైకోర్టు మరో కీలక వ్యాఖ్య చేసింది. దమ్మాలపాటిపై అన్యాయంగా కేసులు పెట్టి మానసిక వేదనకు గురి చేసినందుకు ఆయన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఔను, మీరు చదువుతున్నది నిజమే. జగన్ ప్రభుత్వం కేసులు పెట్టి మానసికంగా వేధించిందని దమ్మాలపాటి భావిస్తుంటే… నిరభ్యంతరంగా కేసులు పెట్టి శిక్ష పడేలా చర్యలు తీసుకునే అన్ని హక్కులు ఆయనకు దక్కాయి. దటీజ్ దమ్మాలపాటి!