తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను ప్రశంసిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేయడంలో రాజకీయం హైలెట్ అవుతూ ఉంది. ఉన్నఫలంగా స్టాలిన్ ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశంసించాడు? అంటే.. చెప్పుకోదగిన విశేషం ఏమీ లేదు. అరివీరభయంకరమైన పోరాటం తర్వాత ఏమీ స్టాలిన్ అధికారంలోకి రాలేదు. ఉన్న ప్రత్యామ్నాయాల్లో బెటర్ గా అధికారాన్ని అందుకున్నాడు. రాజకీయ శూన్యతలో కూడా స్టాలిన్ సాధించిన సీట్లు మరీ అద్భుతం ఏమీ కాదు.
ఇక ఈ మధ్యకాలంలో స్టాలిన్ గురించి తెలుగునాట వినిపిస్తున్న మాట రాజకీయ ప్రతీకారచర్యలు లేవు అనేది. అందుకు ఉదాహరణలుగా రెండు మూడు అంశాలను ప్రస్తావిస్తూ ఉన్నారు. వాటిని వాట్సాప్ యూనివర్సిటీ ప్రమోట్ చేస్తూ ఉంది. అయితే.. నిన్ననే అన్నాడీఎంకే వాళ్లు స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఒక యూనివర్సిటీకి జయలలిత పేరు పెట్టాలని అన్నాడీఎంకే హయాంలో ప్రతిపాదించినట్టుగా ఉన్నారు. ఆ విషయంలో స్టాలిన్ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. జయలలిత పేరును ఉపసంహరించడం పై అన్నాడీఎంకే అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ కార్యక్రమాలను అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు బహిష్కరిస్తూ ఉన్నారు.
ఇక కీలకమైన జయలలిత మరణం కేసును కూడా స్టాలిన్ కదుపుతున్నాడు. ఈ విషయంలో కూడా అన్నాడీఎంకే ఉలిక్కిపడుతూ ఉంది. జయలలిత మరణం తర్వాత ఆమె ఎస్టేట్ లో దొంగతనం జరగడం, ఎస్టేట్ కు సంబంధించిన వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించడం… వీటన్నింటిపై ఇప్పుడు స్టాలిన్ ప్రభుత్వం దృష్టి పెట్టిందట. ఈ విషయాలు అన్నాడీఎంకేను హడలెత్తిస్తున్నాయి. ఈపీఎస్, ఓపీఎస్ లను ఇరకాటంలోకి నెట్టేయడానికే స్టాలిన్ జయ మరణంపై విచారణ అంటున్నాడనే రాజకీయ విమర్శలు అక్కడ తప్పడం లేదు. అయితే తమ ఎన్నికల హామీల్లో జయ మరణం గురించి విచారణ జరిపించడం కూడా ఒకటని స్టాలిన్ అంటున్నారు. కాబట్టి విచారణ జరుగుతుందని అంటున్నారు. అదీ తమిళ రాజకీయం.
అయితే.. ఇక్కడ నుంచి కితాబులిస్తున్న వారు పైపైనే చూస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చే వరకూ ఎన్ని రాజకీయాలు అయినా చేయొచ్చని, అధికారంలోకి వచ్చాకా చేయకూడదంటున్నారట పవన్ కల్యాణ్. మరి స్టాలిన్ విషయంలో అక్కడి ప్రతిపక్షాల ఆందోళన అర్థం కావడం లేదు కాబోలు. అయినా తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉన్నప్పుడే అక్కడి తెలుగువారు, ఇతరులు హడలిపోతూ ఉంటారు. రకరకాల ద్రవిడవాద నిర్ణయాలతో అక్కడే ఉండే తెలుగువారితో సహా అనేక మందిని ఇబ్బంది పెట్టడంలో అన్నాడీఎంకే కన్నా డీఎంకేనే ముందు ఉంటుంది. కాబట్టి.. స్టాలిన్ ను ప్రశంసించేయడంలో కాస్త ముందు వెనుకలు చూసుకోవాలి.
అయితే జగన్ రాజకీయ ప్రతీకారచర్యలకు పాల్పడుతున్నాడు అనే ఆవేదనతో పవన్ కల్యాణ్ స్టాలిన్ ను ప్రశంసించారేమో. అయినా పవన్ కల్యాణ్ పై ఇప్పటి వరకూ జగన్ ఎక్కడా రాజకీయ ప్రతీకార చర్యలకు దిగిన దాఖలాలు లేవు. టీడీపీ ఈ విషయంలో ఆవేదన వ్యక్తం చేసినా ఒక అర్థం. మరి పవన్ ఎందుకు భుజాలు తడుముకుంటున్నట్టు! ఇదంతా జగన్ పై కోపమా? లేక చంద్రబాబుపై ప్రేమ?
ఇంకో విషయం..తమిళనాడులో డీఎంకే వ్యతిరేక శిబిరంలో ఉంది బీజేపీ. మరి బీజేపీ దోస్తీ అయిన పవన్ కల్యాణ్.. ఇలా డీఎంకేను ప్రశంసించేస్తున్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వాన్ని.. సెంట్రల్ గవర్నమెంట్ అనేది లేదని, అది యూనియన్ గవర్నమెంట్ మాత్రమేనంటూ డీఎంకే బీజేపీకి ఆగ్రహాన్ని కలిగించింది కూడా.