తమ ఆదేశాలను అమలు చేయరా అంటూ తెలంగాణ సర్కార్‌ను హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణలో కోవిడ్ పరిస్థితులపై విచారణ సందర్భంగా హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. రానున్న మూడు నెలల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే విద్యాసంస్థల్లో రెండు నెలల్లో వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని పేర్కొంది.
కలర్ కోడెడ్ గ్రేడెడ్ రెస్పాన్స్ (సీసీజీఆర్ఏ) కార్యాచరణ ప్రణాళికలో ఆలస్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు సార్లు ఆదేశించినా ఎందుకు సమర్పించలేదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్) డాక్టర్ శ్రీనివాస్‌ను ప్రశ్నించింది.
ఉన్నత స్థాయిలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని హైకోర్టుకు డీహెచ్ విన్నవించారు. ఈ సందర్భంగా హైకోర్టు సీరియస్ అయింది. ప్రభుత్వ పాలసీలే అమలు చేస్తారా? తమ ఆదేశాలు అమలు చేయరా? అని హైకోర్టు నిలదీయడం గమనార్హం.
న్యాయస్థానం ఆదేశాలు అమలు చేయకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. ఈ నెల 30లోగా సీసీజీఆర్ఏ రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా ఔషధాలను అత్యవసర జాబితాలో చేర్చడంలో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అత్యవసర జాబితాలో చేర్చడానికి ఇంకా ఎంత మంది మరణించాలని కేంద్రంపై అసహనం వ్యక్తం చేసింది. వచ్చే 31లోగా అత్యవసర జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.