ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల జీతం నుంచి రికవరీ చేస్తే మాత్రం తీవ్రంగా పరిగణిస్తామని హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోల ద్వారా సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై ఏపీ గెజిటెడ్ అధికారుల జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య గత నెల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గతంలోనే హైకోర్టు విచారణ జరిపింది.
ఇవాళ మరోసారి విచారణలో భాగంగా కీలక హెచ్చరిక చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. నూతన పీఆర్సీ వల్ల ఉద్యోగుల వేతనాల్లో కోత పడుతుందని, రికవరీ చేస్తామని జీవోల్లో ప్రభుత్వం పేర్కొందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏ ఉద్యోగి జీతం నుంచి రికవరీ చేయొద్దని ఆదేశిస్తూ గత నెలలో హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఇవాళ మరోసారి మరింత గట్టిగా ప్రభుత్వాన్ని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. పిటిషనర్ చెబుతున్నట్టు ఒకవేళ రికవరీకి ప్రభుత్వం దిగితే మాత్రం తీవ్రంగా పరిగణిస్తామని హైకోర్టు గట్టిగా హెచ్చరించింది. పీఆర్సీ జీవోలను పిటిషనర్‌కు ఇవ్వాలని ఆదేశించింది. కౌంటర్‌తో పాటు పీఆర్సీ నివేదికను దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వానికి చుక్కెదురైంది.
ఐఆర్‌ను రికవరీ చేసి నష్టాన్ని పూడ్చుకోవాలని ఆశించిన ప్రభు త్వానికి న్యాయస్థానం ఆదేశాలు అడ్డంకిగా మారాయి. తాము రికవరీ చేయమని ప్రభుత్వం ఉద్యోగులకు హామీ ఇచ్చినప్పటికీ, తాజా జీవోల్లో ఆ విషయం లేదని ఉద్యోగులు వాపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా హైకోర్టు ఉత్తర్వులు ఉద్యోగులకు ఊరటనిచ్చాయి.