ఎప్పుడూ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చిందంటూ సంబరాలు చేసుకునే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ఎల్లో మీడియాకు ఈ సారి సీన్ రివర్స్ అయింది. హైకోర్టు ప్రశ్నలతో టీడీపీ, ఎల్లో మీడియాకు షాక్ తగిలినట్టైంది. అసలు హైకోర్టు నుంచి ఇలాంటి ప్రశ్నలను అసలు ఊహించి ఉండరు. అంతేకాదు, తమకు హైకోర్టు వ్యతిరేకమనే భావనలో ఉన్న అధికార వైసీపీ కూడా ఈ పరిణామాన్ని ఏ మాత్రం ఊహించలేదు. అయితే ఇదేదో పిల్‌పై అంతా అయిపోయిందని కాదు. తాత్కాలికం మాత్రమే.
ప్రభుత్వ ప్రకటనల్లో సీఎం ఫొటోను పెద్దగా వాడడంతోపాటు, వాణిజ్య ప్రకటనల జారీలో జగన్ సర్కార్ పత్రికలపట్ల వివక్ష చూపుతోందంటూ విజయవాడకు చెందిన కిలారి నాగశ్రవణ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశాడు. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ రాకేశ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాకేశ్‌కుమార్ పిటిషినర్‌ను కొన్ని ఘాటు ప్రశ్నలు వేశారు.
‘ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో దివంగత సీఎం (వైఎస్ రాజశేఖరరెడ్డి) ఫొటో ఉండకూడదంటున్నారు.. ఇలా ఉండకూడదని ఏ నిబంధనల్లో ఉంది? సుప్రీంకోర్టు తీర్పులో కూడా అలా ఉండ కూడదని ఎక్కడా లేదే! అయినా, ఆయన ఫొటో ఉండటంలో తప్పేంటి? ఆయన కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు కదా! ప్రభుత్వ ప్రకటనల్లో ఇలాంటి వాటిపై మీకు అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకే వెళ్లి చెప్పుకోండి’ అంటూ అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
పిటిషనర్ తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదిస్తూ ప్రకటనల జారీ విషయంలో సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటోందన్నారు. హైకోర్టు జోక్యం చేసుకుంటూ కేంద్ర, రాష్ట్రాలు ఏవైనా మార్గదర్శ కాలు రూపొందించాయా? అని ప్రశ్నించింది. లేదని దమ్మాలపాటి చెప్పగా, అలా అయితే సుప్రీంకోర్టుకే వెళ్లి చెప్పండని ధర్మాస నం సూచించింది.
అయితే ఒకసారి సుప్రీంకోర్టు నిబంధనలు ఖరారు చేశాక రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అమలు చేయాల్సిందేనని , అందుకు విరుద్ధంగా నడుచుకున్నప్పుడు పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించవచ్చని న్యాయవాది శ్రీనివాస్ వాదించారు. ధర్యాసనం స్పందిస్తూ ఈ వ్యవహారంపై విచారణకు ఎలా ఆదేశించాలని ప్రశ్నించింది.
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌కు చంద్రబాబు బాస్ అని, అతను టీడీపీ చుట్టూ తిరుగుతుంటారని తెలిపారు. చంద్రబాబు హయాంలో పత్రికలకు ప్రకటనలిచ్చినప్పుడు పసుపు రంగు వాడారంటూ, ఓ పత్రికా ప్రకటనను ఏజీ ధర్మాసనానికి చూపించారు. అప్పుడు పిటిషనర్ ఎందుకు మాట్లాడలేదని, ఇలాంటి వైఖరిని న్యాయ స్థానం పరిగణనలోకి తీసుకోవాలని ఏజీ కోరారు. అనంతరం ఈ వ్యాజ్యాన్ని సీజే ధర్మాసనానికి పంపుతామంటూ న్యాయ మూర్తులు జస్టిస్ రాకేష్‌కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.
కాగా వాణిజ్య ప్రకటనలు పొందలేకపోవడంతో నష్టపోతున్న పత్రికలు, చానళ్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా…ఏ సంబంధం లేని వ్యక్తి పిల్ వేయడంలోని లోగుట్టు ఎవరికీ తెలియంది కాదు. ఇదే విషయాన్ని హైకోర్టు కూడా గ్రహించి పరోక్షంగా చీవాట్లు పెట్టినట్టు అర్థం చేసుకోవాలి.