టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యతలు చేపట్టి నేటికి 25 ఏళ్లు. 1995, సెప్టెంబర్ 1న ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నాటకీయ పక్కీలో చంద్రబాబు సీఎం అయ్యారు. కష్టమొకరిది….పదవి మరొకరికి అనే రీతిలో… తనకు పిల్లనిచ్చిన మామ, నట సార్వభూముడు ఎన్టీఆర్ విశేష ప్రజాదరణతో 1994లో అధికారాన్ని దక్కించుకున్నారు.
కానీ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి రాజ్యాంగేతర శక్తిగా అధికారాన్ని చెలాయిస్తు న్నారని, ఇలాగైతే పార్టీ, ప్రభుత్వం అప్రతిష్టపాలు అవుతాయనే సాకుతో…మామ అని కూడా చూడకుండా పదవీచ్యుతుడిని చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుంది.
చంద్రబాబులో గొప్పతనం ఏంటంటే…లోకం గురించి అసలు పట్టించుకోకపోవడం. బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతాను రాగాలకు ఆయన డిక్షనరీలో స్థానం లేకపోవడమే చంద్రబాబు సక్సెస్‌కు కారణంగా చెబుతుంటారు. పదవి కోసం ఎవరినైనా బలిపెట్టడానికి ఆయన సిద్ధమని చెబుతారు. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా ఎన్టీఆర్ లాంటి మహానేతను అధికారం నుంచి దించి వేయడాన్ని చెబుతారు.
ఏది ఏమైనా మొదటి సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు కంటిన్యూగా తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం నాడు కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు, వాజ్‌పేయ్‌తో పొత్తు కలిసి వచ్చాయి. అంతేతప్ప ఇందులో చంద్రబాబునాయుడు ప్రతిభ అంటూ ప్రత్యేకంగా చెప్పుకునేదేమీ లేదు. ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు అదృష్టంగానే చెప్పాలి.
తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనంటే జనం ఇప్పటికీ జడుసుకునే పరిస్థితి. కరెంట్ చార్జీలు తగ్గించాలంటూ చేపట్టిన ఆందోళన చేపట్టిన నిరసనకారులపై బషీర్‌బాగ్‌లో అమానవీయంగా జరిపిన కాల్పుల మోత…నేటికీ తెలుగు రాష్ట్రాల ప్రజల చెవుల్లో మార్మోగుతోంది. 2004, 2009లో వరుసగా వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చిందంటే…బాబు పాలన ఎంతగా భయపెట్టిందో అర్థం చేసుకోవచ్చు.
వైఎస్ మరణం, రాష్ట్ర విభజన తదితర అంశాల్లో ఏపీలో అనేక రాజకీయ పరిణామాలకు కారణాలయ్యాయి. 2014లో మోడీ చరిష్మాతో 2014లో చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. అయినా ఆయనలో మార్పు రాలేదు. ఐదేళ్లలో తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటకట్టుకున్నారు. జన్మభూమి కమిటీలతో ఇష్టానుసారం వ్యవహరించారు. చివరికి గత సార్వత్రిక ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష స్థానంలో కూచోపెట్టారు.
ఏది ఏమైనా చంద్రబాబు రాజకీయాల గురించి మాట్లాడాల్సి వస్తే…మామను వెన్నుపోటు పొడవడంపై తప్పక చర్చకు వస్తుంది. ఈ మచ్చ ఎప్పటికీ పోదు. తనను పదవీచ్యుతుడిని చేసినప్పుడు అల్లుడి గురించి ఎన్టీఆర్ ఆవేశంతో, ఆవేదనతో చెప్పిన మాటలు చిరస్థాయిగా నిలుస్తాయి.
ముఖ్యమంత్రిగా మొత్తం 14 ఏళ్ల బాబు పనిచేశారు. అయినప్పటికీ…ఆయనలోని వెన్నుపోటు చరిత్ర చిరకాలం గుర్తుండిపోతుంది. భావితరాలు బాబును ఆ విధంగానే గుర్తించుకుంటాయి. బాబు ముఖ్యమంత్రి సినిమాలో ఆయనే హీరో, విలన్ కావడం అత్యంత విషాదం.