తెలంగాణలో ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తున్న కరోనా రాజకీయ నాయకుల్ని సైతం వదలడం లేదు. ఈసారి ఏకంగా తెలంగాణ హోం మినిస్టర్ కు కరోనా సోకింది. అవును.. తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీకి కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. 3 రోజులుగా అపోలో హాస్పిటల్ లో ఆయనకు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.
కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు మహమూద్ అలీ. ఆయనకు ఆల్రెడీ ఆస్తమా ఉండడంతో ముందుజాగ్రత్త చర్యగా ఆయన్ను హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయితే కుటుంబ సభ్యుల అనుమానాలే నిజమయ్యాయి. అలీకి కరోనా పాజిటివ్ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి స్థాయి వ్యక్తికి కరోనా సోకడం ఇదే ప్రథమం.
ఇప్పటికే ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, గణేష్ గుప్తా, బాజిరెడ్డి కరోనా బారిన పడ్డారు. వీళ్లకు ప్రస్తుతం ట్రీట్ మెంట్ కొనసాగుతోంది. ఇప్పుడీ లిస్ట్ లోకి ఏకంగా హోమ్ మంత్రి చేరారు.
హోమ్ మినిస్టర్ కు పాజిటివ్ రావడంతో పోలీస్, వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. గడిచిన వారం రోజులుగా హోమ్ మినిస్టర్ ను కలిసిన వాళ్లందర్నీ హోమ్ క్వారంటైన్ లో ఉంచారు. మరోవైపు మినిస్టర్ కుటుంబ సభ్యుల శాంపిల్స్ తీసుకోవడంతో పాటు.. ఆయన ఇంటిని శానిటైజ్ చేశారు. ప్రస్తుతం హోమ్ మంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.