అదే నిర్లక్ష్యం.. కొనసాగుతున్న కరోనా కష్టాలు

దేశవ్యాప్తంగా కరోనా కష్టాలు కొనసాగుతున్నాయి. వైరస్ బారిన పడి మరణించిన వారిని చివరి చూపు కూడా చూడలేకపోతున్నారు కుటుంబ సభ్యులు, బంధువులు. ఇదొక బాధ అయితే, మరోవైపు ఏడాది దాటినా కరోనా మృతదేహాల విషయంలో…

దేశవ్యాప్తంగా కరోనా కష్టాలు కొనసాగుతున్నాయి. వైరస్ బారిన పడి మరణించిన వారిని చివరి చూపు కూడా చూడలేకపోతున్నారు కుటుంబ సభ్యులు, బంధువులు. ఇదొక బాధ అయితే, మరోవైపు ఏడాది దాటినా కరోనా మృతదేహాల విషయంలో అధికారుల వ్యవహార శైలి ఏమాత్రం మారలేదు. ఇప్పటికీ మృతదేహాల అప్పగింత విషయంలో అదే నిర్లక్ష్యం.

తాజాగా తెలంగాణలో ఓ కుటుంబానికి చెందిన కరోనా మృతదేహాన్ని, మరో కుటుంబానికి అప్పగించి పెద్ద తప్పు చేశారు అధికారులు. బాధాకరమైన విషయం ఏంటంటే.. అది తమ కుటుంబానికి చెందిన మృతదేహమేనని భావించి ఆ కుటుంబీకులు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. సిద్ధిపేట్ లో జరిగింది ఈ ఘటన.

చేర్యాల మండలానికి చెందిన వజ్రమ్మ అనే వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో సిద్ధిపేటలోని కొవిడ్ కేర్ సెంటర్ కు తరలించారు. అయితే ఆమె మృతి చెందింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు హాస్పిటల్ సిబ్బంది. మృతదేహాన్ని తీసుకునేందుకు హాస్పిటల్ కు వచ్చిన కుటుంబ సభ్యులు, అది వజ్రమ్మ మృతదేహం కాదని నిర్థారించారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. అదే పేరుతో మరో వృద్ధురాలు కూడా కరోనాతో మరణించింది. ఆమె బంధువులకు చేర్యాల మండలానికి చెందిన వజ్రమ్మ భౌతికకాయాన్ని అందించారు సిబ్బంది. వాళ్లు ఆ మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు.

ఇలా హాస్పిటల్ సిబ్బంది చేసిన తప్పుతో.. వజ్రమ్మకు మరో కుటుంబం అంత్యక్రియలు చేసింది. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు గతేడాది నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ సరైన ప్రణాళికతో వ్యవహరించకపోవడం బాధాకరం.