ఏపీ ప్రజానీకానికి ఊపరి పోసే నిర్ణయాన్ని జగన్ సర్కార్ తీసుకుంది. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు. కరోనా సెకెండ్ వేవ్ జనం ఊపిరి తీస్తోంది.
యువకులు కూడా మహమ్మారి బారిన పడి ఊపిరి తీసుకోలేక ప్రాణాలు విడుస్తున్న వైనం నిత్యం మన అనుభవంలోకి వస్తున్నదే. ఈ నేపథ్యంలో ఇక మీదట ఆక్సిజన్ లేక మనిషి ప్రాణాలు పోగొట్టు కునే పరిస్థితి రాకూడదనే ఆశయంతో జగన్ సర్కార్ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంది.
ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ ప్రభుత్వం రూ.309.87 కోట్లు కేటాయిస్తూ వైద్యారోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 49 చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటు, 50 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. అలాగే 10 వేల అదనపు ఆక్సిజన్ పైప్‌లైన్ల ఏర్పాటు చేయనుంది. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ కోసం జిల్లాకు రూ.10 లక్షల చొప్పున .. 6 నెలలకు రూ.60 లక్షలకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే ఈ మొత్తం వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణ ఇంఛార్జ్‌గా స్పెషల్ సీఎస్ కరికాల వలవన్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ దిగుమతిని ఆయన పర్యవేక్షిస్తారు. రోగుల ఆర్తనాధాలను విన్న జగన్ సర్కార్ …వెంటనే అప్రమత్తమై ఆక్సిజన్ సరఫరాకు చర్యలు తీసుకోవడం ప్రశంసలు అందుకుంటోంది.
ఇప్పటి వరకూ పడిన ఇబ్బందులను పక్కన పెడితే, ఇక మీదట ఆక్సిజన్ సమస్య ఉత్పన్నం కాకుండా సత్వర చర్యలు చేపట్టడం అభినందనీయం. పనిలో పనిగా ఆస్పత్రుల్లో అధిక బిల్లులపై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపితే కరోనా బాధిత కుటుంబాలకు ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. కరోనా కంటే దానికయ్యే వైద్య ఖర్చలకే జనం బెంబేలెత్తుతున్న దయనీయ స్థితి.