తెలంగాణ ముఖ్యమంత్రి మాటలు ఎంత తీయగా ఉంటాయంటే.. ఆయన ఏదైనా అంశంపై మాట్లాడుతుంటే.. వినేవాడు స్వర్గంలో అలా తేలిపోవాల్సిందే. గత ఎన్నికల టైమ్ లో జర్నలిస్టులు కూడా అలానే తేలిపోయారు.
ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడమే ఆలస్యం, అలా తమకు ఇళ్ల స్థలాలు వచ్చేస్తాయని, గృహప్రవేశాలు చేసేస్తామని కలలుకన్నారు. అయితే ఆ కలలు ఆవిరవ్వడానికి అట్టే టైమ్ పట్టలేదు. కేసీఆర్ తమకు అరచేతిలో 70ఎంఎం సినిమా చూపించారనే విషయాన్ని పాత్రికేయులు తొందరగానే గ్రహించారు.
కేసీఆర్ రెండో విడత సీఎం కుర్చీలో కూర్చున్నప్పట్నుంచి జర్నలిస్టులు పలు సందర్భాల్లో తమ బాధను వ్యక్తంచేస్తూనే ఉన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని కోరుతున్నారు. కానీ కేసీఆర్ కు మాత్రం జర్నలిస్టులు కనిపించేది కేవలం ఎన్నికల టైమ్ లోనే.
మొన్న సార్వత్రిక ఎన్నికల టైమ్ లో ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులంటూ జర్నలిస్టుల్ని ఊరించిన ముఖ్యమంత్రికి ఇప్పుడు మరోసారి పాత్రికేయులు గుర్తొచ్చారు. దీనికి కారణం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు.
తెలుగు రాష్ట్రాల్లో అత్యథికంగా జర్నలిస్టులు ఉండేది హైదరాబాద్ లోనే. అలాంటి నగరంలో గేటెడ్ కమ్యూనిటీ టైపులో జర్నలిస్టులకు సువిశాలంగా ఇళ్లు కట్టించి ఇస్తామని కేసీఆర్ మరోసారి మరోసారి పాత పాట అందుకున్నారు.
బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈసారి కూడా జర్నలిస్టులు నమ్ముతున్నారు. నమ్మక తప్పని పరిస్థితి. ఎందుకంటే.. జర్నలిస్టుల్లో కేసీఆర్ పై వ్యతిరేకత ఉండొచ్చు. కానీ జర్నలిస్టు సంఘాలన్నీ కేసీఆర్ కు అనుకూలమే. సంఘాలు జై కొట్టినప్పుడు, వ్యక్తిగత స్థాయిలో పాత్రికేయులు ఏం చేయలేని పరిస్థితి.
ఇక వాస్తవ పరిస్థితి చూస్తే.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా మారినప్పట్నుంచి ఇప్పటివరకు, ఈ ఏడేళ్లలో ఒక్క జర్నలిస్ట్ కు ఒక్క ఇల్లు కూడా మంజూరు అవ్వలేదు. అడిగితే కోర్టు కేసులంటూ మెలిక పెడుతున్నారు. నిజంగా అంత చిత్తశుద్ధి అంటే కేసీఆర్ కు కోర్టు కేసులు ఏమాత్రం అడ్డంకి కావు. ఎందుకంటే, అలాంటి స్వార్థపూరిత కేసులవి. కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కృతమయ్యేవే.
ఇక హెల్త్ కార్డులు మరో దారుణం. మూడేళ్లుగా జర్నలిస్టుల హెల్త్ కార్డులు పనికిరాకుండా పోయాయి. అవి జేబుల్లో పెట్టుకోవడానికి తప్ప, ఏ హాస్పిటల్ లో పట్టించుకున్న పాపాన పోలేదు. మరీ ముఖ్యంగా ఈ కరోనా టైమ్ లో హెల్త్ కార్డులు పనిచేయక చాలామంది జర్నలిస్టులు అవస్థలు పడ్డారు. కొంతమంది ప్రాణాలు కోల్పోతే, మరికొంతమంది అప్పులు చేసి ట్రీట్ మెంట్ చేయించుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి.
ఓవైపు మీడియా యాజమాన్యాలు పట్టించుకోక, మరోవైపు ప్రభుత్వం కూడా దయచూపకపోవడంతో పాత్రికేయుడిది వైట్ కాలర్ బిచ్చగాడి బతుకైంది. కనీసం ఈ గ్రేటర్ ఎన్నికల సందర్భంగానైనా.. కేసీఆర్-కేటీఆర్ ఈ అంశాలపై దృష్టిసారిస్తే.. కాస్ట్ లీగా మారిన హైదరాబాద్ లో జర్నలిస్టులు అంతో ఇంతో మెరుగ్గా జీవించగలుగుతారు. లేదంటే సగం జీతం ఇంటి అద్దెకు చెల్లిస్తూ జీవితాలు నెట్టుకురావాల్సిందే.